KTR: ఆ రెండు రాష్ట్రాలేనా.. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి: కేటీఆర్

Update: 2024-07-23 11:23 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు ఏమీ అందలేదని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు విమర్శించారు. తెలుగు కోడలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు బడ్జెట్‌లో గణనీయమైన నిధులు కేటాయిస్తారని మేము ఆశించాము. కానీ మనకు లభించినది ఏమీ లేదు. రూ.48 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రమే కీలక ప్రయోజనాలను పొందాయని అన్నారు. మొత్తం బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందని.. మరోసారి తెలంగాణకు ఏమీ అందలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇచ్చిన దాదాపు 35 వాగ్దానాలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారన్నారు. పదేపదే లేఖలు రాశామని.. విజ్ఞప్తులు చేశామన్నారు. ములుగు యూనివర్శిటీకి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్రం అదనపు నిధుల గురించి ప్రస్తావించలేదన్నారు కేటీఆర్.

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన నిధుల విషయంలో తమకు ఎలాంటి సమస్య లేదని.. సోదర రాష్ట్రంగా, మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా తెలంగాణ పదాన్ని ప్రస్తావించలేదని కేటీఆర్ అన్నారు. రాజధాని, అమరావతి, పోలవరం, పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ముఖ్యమైన నిధుల పట్ల మేము సంతోషిస్తున్నాము. కానీ మిగిలిన 26 రాష్ట్రాలను పట్టించుకోకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్‌లకు మాత్రమే నిధులు అందడం నిజంగా నిరాశాజనకంగా ఉందని కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News