టీఆర్ఎస్, బీజేపీ నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో సీఎం కేసీఆర్ దేశంలోని ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు. పీఎం మోదీని గద్దె దించాల్సిన అవసరముందని.. లేకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందంటూ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఇప్పటికే కేసీఆర్‌పై గుర్రుగా ఉన్న బీజేపీ సైతం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా వాడుకుంటోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బలమైన నేతలను వెతికి మరీ పార్టీలో చేర్చుకుంటూ బలోపేతం దిశగా ముందుకు సాగుతోంది. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు చేస్తోంది.
టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ వైరంతో కేసీఆర్ సర్కార్.. కేంద్రంలోని మోదీ సర్కార్ నడుమ అగాథం ఏర్పడింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా కేంద్రం విడుదల చేయడం లేదంటూ టీఆర్ఎస్ మంత్రులు ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేశారు. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్రం తమ రాష్ట్రానికి కేటాయించలేదని.. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బల్క్ డ్రగ్ పార్కుల వ్యవహారంతో మరోమారు వివాదం రాజుకుంది. ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణను కాదని ఏపీ సహా మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్కులను కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులపై సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణను కాదని ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లకు బల్క్ డ్రగ్ పార్క్‌లను కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఫార్మాసిటీలో 2000 ఎకరాల భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినా కేంద్రం మొండిచేయి చూపడం దారుణమన్నారు. అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌లో వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉందని.. మిగిలిన రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఇంకా మూడేళ్ల సమయం పడుతుందన్నారు. కేవలం వివక్షతోనే బల్క్ డ్రగ్ పార్కులను తెలంగాణకు కేటాయించలేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ లేఖ పంపారు.