Nagarjuna Sagar : సాగర్ వివాదం.. కలకలం.. కారణమేంటి?
తెలంగాణ ఎన్నికలు జరిగే రోజు నాగార్జున సాగర్ జలాల వివాదం రేకెత్తడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి
తెలంగాణ ఎన్నికలు జరిగే రోజు నాగార్జున సాగర్ జలాల వివాదం రేకెత్తడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈరోజు వరకూ లేని సమస్య పోలింగ్ కు ముందు అర్ధరాత్రి ఎందుకు జరిగిందన్న ప్రశ్న తలెత్తుతుంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య నీటి పంపకాల కోసం ఇరువురూ పట్టుబడుతున్నారు. రెండు ప్రభుత్వాలు ఇప్పటి వరకూ కూర్చుని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయలేదు. కేవలం పోలింగ్ రోజు మాత్రమే ఏపీ పోలీసులు నాగార్జునసాగర్ వద్దకు హడావిడి చేయడం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుంది.
కుడికాల్వ నుంచి...
నాగార్జున సాగర్ కుడికాల్వ నుంచి నీటిని విడుదల చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పదమూడు గేట్ల నుంచి ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేయడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులకు, ఏపీ పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. అక్కడ ముళ్ల కంచెను వేశారు. డ్యామ్ మీదకు ఎవరినీ అనుమతించడం లేదు. రాకపోకలను నిషేధించారు. అటు వైపు ఎవరిని రానివ్వకుండా నిషేధాజ్ఞలు విధించారు.
అనేక అనుమానాలు...
అయితే ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపుతుంది. తెలంగాణ పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కావాలని సృష్టించిందేనని కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు చెబుతున్నాయి. సెంటిమెంట్ ను రగిలించి ఓట్లు దండుకోవడానికి ఒక పార్టీ వేసిన ప్లాన్ అని కొందరు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకూ పరిష్కరించుకోని వారు ఇప్పుడే ఈ హంగామా సృష్టించి ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ ను రగిలించడానికి సాగర్ ను వాడుకుంటున్నారని పలువురు నేతలు ఆరోపించారు. కానీ అధికార పార్టీ మాత్రం దీనిపై మాట్లాడుతూ ఎప్పుడూ సాగర్ జలాల పంపిణీ వివాదం నడుస్తూనే ఉందని తెలిపారు.