Telangana : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనున్న సర్కార్.. ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి అంతా సిద్ధం చేసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని కూడా వీలయినంత త్వరలోనే అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటికే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్తు వంటి పధకాలను అమలు చేసింది.
నెలకు రూ.2,500లు...
అయితే మరో పధకమైన మహాలక్ష్మిని కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద నెలకు మహిళల ఖాతాల్లో 2,500 రూపాయల నగదును జమ చేయనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. మొన్నటి వరకూ లోక్‌సభ ఎన్నికలు ఉండటం, ఎన్నికల కోడ్ విధించడంతో అమలు చేయలేదు. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం వంటి అంశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లు ఎక్కువగా చేయడంతో దీనిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు.
సూత్రప్రాయంగా...
ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సర్కార్ ఈ పథకాన్ని ఆషాఢమాసంలో ప్రారంభించాలని తొలుత నిర్ణయించింది. బోనాలు పండగ ఉండటంతో ఆషాడ మాసం బోనాల సమయంలో ఇవ్వాలని కొందరు చెప్పడంతో అందుకు అంగీకరించారు. అయితే మహిళలకు ఇష్టమైన ఆగస్టు మాసం నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఆగస్టు నెల శ్రావణ మాసం కావడంతో మహిళలు శుభప్రదంగా భావిస్తారు. అందుకోసమే ఈ నెలలో కానీ, లేదా వచ్చే నెలలో కానీ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో జరిగే బోనాలకు ఇవ్వాలని భావిస్తే ఈ నెలలోనే మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు పడతాయి. లేకుంటే శ్రావణ మాసమైన ఆగస్టు నెలలో జమ చేస్తారు.
విధివిధానాలు ఇవీ...
ఇందుకు సంబంధించి అర్హతపై విధివిధానాలను కూడా ఖరారు చేసింది. ఇక ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆ కుటుంబంలో మరెవరు పింఛన్లు ఉండకూడదన్న నిబంధన కూడా ఉందని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తిగా నిర్ణయం జరగలేదు. ఎటువంటి పింఛను అందని తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని అందించాలన్నది మాత్రం ప్రాధమికంగా నిర్ణయించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతా సక్రమంగా జరిగితే ఈ నెల కానీ, వచ్చే నెలలోకానీ మహాలక్ష్మి సొమ్ము మహిళల ఖాతాల్లో జమ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.