Telangana : తెలంగాణలో చలి పెరుగుతోంది.. ఇక జాగ్రత్తలు అవసరం మరి
తెలంగాణలో నేడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చల్ల గాలులు వీస్తున్నాయి.
తెలంగాణలో మొన్నటి వరకూ ఉక్కపోత.. అత్యధిక ఉష్ణోగ్రతలు. కానీ నేడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చల్ల గాలులు వీస్తున్నాయి. ప్రధానంగా రాత్రి వేళ చలిగాలులు మొదలయ్యాయి. నవంబరు నెల వస్తుండటంతో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి క్రమంగా పెరుగుతుందని, అలాగే పగటి వేళ వేడి కూడా అంతే స్థాయిలో ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ భిన్నమైన వాతావరణం ప్రజలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుందని తెలిపింది. తెలంగాణలో 34 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పగటి పూట నమోదవుతున్నాయి.
రాత్రి వేళకు...
అదే రాత్రి వేళ వచ్చేసరికి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో రాత్రి వేళ 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ భిన్నమైన వాతావరణం కారణంగా అనేక రకాలైన వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వైరస్ వంటివి కూడా ఈ సీజన్ లో సులువుగా అంటుకునే అవకాశముంది. అందుకే సాయంత్రం, రాత్రి వేళ బయటకు వచ్చే వాళ్లు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరింది. లేకుంటే జ్వరం,దగ్గు,జలుబు వంటివి సులువుగా ప్రజలకు సోకుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.