సోషల్ మీడియా సెన్సేషన్ సర్పంచ్ 'నవ్య'.. ఎన్నికల్లో పోటీ!
సోషల్ మీడియా సెన్సేషన్ సర్పంచ్ నవ్య.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో
సోషల్ మీడియా సెన్సేషన్ సర్పంచ్ నవ్య.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై గతంలో ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు జానకీపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య. ఆ తర్వాత ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి అవకాశమిస్తే పోటీ చేస్తానని ఆమె గతంలో చెప్పారు. ఇక్కడి నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. దీంతో సర్పంచ్ నవ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
తాను ఓ వార్డు మెంబర్‌గా, ఆ తర్వాత సర్పంచ్‌గా గెలిచానని.. ఇప్పుడు ఎమ్మెల్యే కోసం నామినేషన్ దాఖలు చేశానన్నారు నవ్య. తనకు ఎవరి మీద పగ, కోపం లేవన్నారు. రాజకీయంగా ఎదిగే ఉద్దేశం, అలాగే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలని, అందుకే తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా తనను ఓ అక్కలా, చెల్లిలా, తమ కుటుంబంలో ఓ వ్యక్తిగా ఆశీర్వదిస్తారని భావిస్తున్నానన్నారు. స్టేషన్ ఘనపూర్‌లోని అన్ని నియోజకవర్గాలకు వెళ్లి తాను ప్రచారం చేస్తానని, ఏ గ్రామంలో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటానన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.