Revanth Reddy : తెలంగాణ ప్రజలు కంచరగాడిదను తరిమి కొట్టి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు
కేసీఆర్ తన బంధువులకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ తన బంధువులకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్.బి. స్టేడియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు కంచరగాడిదను తరిమికొట్టి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే రారని, నల్లగొండకు వెళ్లి సభ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ యువతకు ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు.
త్వరలోనే భర్తీ...
టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని, త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీ రాని వారికి అధికారం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తనను చంపుతారా? అని ప్రశ్నిస్తున్నారని, చచ్చిన పామును ఎవరు చంపుతారని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే పదేళ్లు అధికారంలో ఉంటామని, ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు కూడా తెలంగాణను పాలిస్తామని చెప్పారు. ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే ఇంత వరకూ ఉద్యోగాలను భర్తీ చేయలేదని రేవంత్ రెడ్డి అన్నరాు. ఇంటికే నియామకపత్రాలను పంపించవచ్చు కదా? అని హరీశ్‌రావు ప్రశ్నిస్తున్నారని, తాము అందరినీ కలుసుకునేందుకే ఇక్కడకు వచ్చామని చెప్పారు.
గత పదేళ్లలో...
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేకపోయిందని అన్నారు. ఒక జనరేషన్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. తన కుటుంబ సభ్యులు మాత్రం ఓడిపోయిన వెంటనే పదవులు ఇచ్చుకోవడం తెలిసిన కేసీఆర్ కు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల నుంచి యువతను పట్టించుకోకుండా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం నిజం కాదా? అంటూ నిలదీశారు. ఎల్.బి. స్టేడియంలో వివిధ శాఖల్లో ఎంపికయిన వారికి నియామక పత్రాలను రేవంత్ రెడ్డి అందచేశారు.