Revanth Reddy : రేవంత్ మరింత స్పీడ్ పెంచనున్నారా? ఇక వారే టార్గెట్‌గా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక దూకుడు పెంచేందుకు రెడీ అయిపోయినట్లున్నారు

Update: 2024-10-05 11:52 GMT

revanth reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక దూకుడు పెంచేందుకు రెడీ అయిపోయినట్లున్నారు. మూసీ నది సుందరీకరణకు రేవంత్ గట్టిగా నిలబడి ఉన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి హైకమాండ్ ను కూడా రేవంత్ రెడ్డి ఒప్పించగలిగినట్లు సమాచారం. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన టోన్ మారింది. ఎవరినీ వదిలేది లేదని, అన్నీ కూలుస్తామని స్వయానా రేవంత్ రెడ్డి సభల్లో చెబుతున్నారంటే అందుకు పార్టీ అధినాయకత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కనపడుతుంది. మూసీ నది సుందరీకరణను లక్షన్నర కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కొంత అడుగులు కూడా వేసింది.

మూసీ నది సుందరీకరణను...
మూసీ నది వెంట ఆక్రమణలను తొలగించి సుందరీకరణ చేయగలిగితే దాని తర్వాత హైదరాబాద్ ప్రజలు తన వైపునకు తిరుగుతారని ఆయన భావిస్తున్నారు. తనకు మద్దతుగా భవిష్యత్ లో సిటీ వాసులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మూసీనది ఆక్రమణల వల్ల భారీ వర్షాలు కురిసినప్పుడల్లా వరదలు ముంచెత్తి ఎంతో నష్టం జరిగింది. అంతే కాదు అనేక ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరడానికి కూడా మూసీనది ఆక్రమణలే కారణమని అందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకూ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆక్రమణలను తొలగించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. దాని వల్ల పొలిటికల్ గా మనం నష్టపోతామని తెలిసి దశాబ్దాలుగా పాలకులు మౌనంగానే ఉన్నారు.
హైడ్రా కూల్చివేతలతో...
కానీ అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నదులు, చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించిన భవనాలను కూల్చివేస్తుంది. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మొదలుపెట్టింది. ఇందుకోసం హైడ్రాను ఏర్పాటు చేసింది. దానికి ఆర్డినెన్స్ ను కూడా జారీ చేసింది. రేపో మాపో అసెంబ్లీలో దానికి ఆమోదం తెలిపిన తర్వాత ఇక న్యాయపరంగా తమకు ఇబ్బందులుండవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ హైడ్రా కూల్చివేతలతో కొంత నిరసనలతో పాటు మరికొన్న చోట్ల నుంచి ప్రభుత్వానికి మద్దతు లభించింది. నగరవాసులు ఎక్కువ మంది ఆక్రమణల కూల్చివేతలను స్వాగతిస్తున్నారు.
హైకమాండ్ కు వివరణ తర్వాత....
మరోవైపు తన పార్టీకి చెందిన వారితో పాటు ఇతర నేతలు కూడా కూల్చివేతలపై రాజకీయంగా నష్టం జరుగుతుందని హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పలుమార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి తన విజన్ ఏంటో అధినాయకత్వానికి చెప్పి ఒప్పించగలిగారు. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సయితం ఫిర్యాదు చేశారు. ఆయన ఫాం హౌస్ ను కూలగొట్టారు. ఇక మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేరు కూడా నేరుగా రేవంత్ ప్రస్తావించారంటే ఆయన కూడా ఫిర్యాదు చేసినట్లే కనపడుతుంది. కేవీపీ ఫాం హౌస్ ను కూడా వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి వంటి వారి ఫాం హౌంస్ లను కూల్చివేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఇంకోవైపు మూసీనది ప్రక్షాళన చేయాల్సిందేనంటూ నల్లగొండ జిల్లా రైతులు రేవంత్ కు వెన్నుదన్నుగా నిలవడం వెనక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కెచ్ ప్రకారం జరుగుతుందన్న టాక్ మాత్రం బలంగా వినపడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News