కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్, హరీశ్ రావు అటాక్

Update: 2023-07-03 02:46 GMT

ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఎన్నో అక్రమాలు చేస్తోందంటూ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. అవినీతి, అసమర్థతకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్​ అడ్రస్ అని.. తాము ఎవరికీ బీ టీమ్ కాదని అన్నారు. కాంగ్రెస్సే భారత రాబందుల పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్స్ అని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను ప్రజలు ఛీకొడుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని, కాంగ్రెస్ కు సీ టీమ్ అంతకన్నా కాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ ఒంటిచేత్తో ఢీకొట్టే సత్తా బీఆర్ఎస్ కు ఉందని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొట్టే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చేందుకు కాంగ్రెస్ కుట్రపన్నుతోందని అన్నారు. వారి ప్రయత్నం మిస్ ఫైర్ అయి ముమ్మాటికీ కాంగ్రెస్సే కుప్పకూలుతుందని అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ అర్థంపర్థం లేని ఆరోపణలు చేసి ప్రజల్లో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారని కేటీఆర్ అన్నారు.

దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్​ పార్టీదేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘అవినీతికి మారుపేరు కాంగ్రెస్. అందుకే ఆ పార్టీ పేరు స్కాంగ్రెస్ గా మారింది. దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదు. మాది పేదల ఏ టీమ్. ప్రజల సంక్షేమం చూస్తే ఏ క్లాస్​టీమ్”అని హరీశ్ అన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్​కు లేదని, అందుకే దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడేందుకు బీఆర్ఎస్ పుట్టిందని తెలిపారు. ‘‘కాళేశ్వరం కోసం ఖర్చు చేసింది రూ.80,321.57 కోట్లని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమే సమాధానం చెప్పింది. అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి అనడం పెద్దజోక్. స్కామ్​లలో ఆరితేరిన కాంగ్రెస్.. కుంభకోణాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే..”అని హరీశ్ రావు అన్నారు. భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్లు, కరెంట్ అడిగితే పిట్టల్లా కాల్చిచంపినోళ్లు ఖమ్మంలో కల్లబొల్లి కబుర్లు చెప్తే నమ్మేవాళ్లు ఎవరూ లేరని అన్నారు.


Tags:    

Similar News