కల్వకుంట్ల కుటుంబాన్ని ఫాంహౌస్ కు పంపడం ఖాయం

తమంతట తాముగా వస్తే పార్టీలో చేర్చుకుంటామే తప్ప భయపెట్టి చేర్చుకునేది లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2022-11-18 12:33 GMT

తమంతట తాముగా వస్తే పార్టీలో చేర్చుకుంటామే తప్ప భయపెట్టి ఎవరినీ పార్టీలో చేర్చుకునేది లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిని సందర్శించిన కిషన్ రెడ్డి ఆయన తల్లిని పరామర్శించారు. కవితపై రాజకీయ విమర్శలు చేయకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలనే ఆలోచన తమకు లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను బీజేపీలో చేర్చుకునే అవసరం తమకు లేదని ఆయన చెప్పారు. నిరాశా నిస్పృహలతో కల్వకుంట్ల కుటుంబం బీజేపీ పైనా, తమ పార్టీ నేతలపై విమర్శలు చేస్తుందన్నారు. బెదిరిస్తే ఇక్కడ ఎవరూ భయపడబోరని అన్నారు. రోజురోజుకూ టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట తగ్గుతుందని ఆయన అన్నారు.

తొలి కేసును...
పార్టీ ఫిరాయింపులపై మొట్టమొదట కేసు పెట్టాలంటే కేసీఆర్ పైనే పెట్టాలన్నారు. రాజీనామాలు కూడా చేయించకుండా తమ పార్టీలో చేర్చుకున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. భయపెట్టి పార్టీలో చేర్చుకునే సంస్కృతి తమది కాదన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఊరికో ఎమ్మెల్యే ఇన్‌చార్జిగా పెడితేనే మునుగోడులో తక్కువ మెజారిటీతో గెలిచారని, సాధారణ ఎన్నికల్లో అది సాధ్యం కాదన్నారు. మజ్లిస్ పార్టీ సహకారంతో బీజేపీ నేతల ఇళ్లపై దాడులు చేయడం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు. ఇటువంటి దాడులకు భయపడబోమని, తెలంగాణ సమాజం సరైన సమయంలో ప్రజాస్వామ్య బద్ధంగా తీర్పు చెబుతుందని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఫాంహౌస్ కు పంపడం ఖాయమని ఆయన అన్నారు.


Tags:    

Similar News