దేశాన్ని అవమానిస్తావా?

కేసీఆర్ అంతరాత్మ కుటుంబ సభ్యుల కోసమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బయట వాళ్లను కేసీఆర్ పట్టించుకోరన్నారు.

Update: 2023-01-18 13:46 GMT

కేసీఆర్ అంతరాత్మ కుటుంబ సభ్యుల కోసమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బయట వాళ్లను కేసీఆర్ పట్టించుకోరన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ సీఎం హోదాలో ఉండి దేశాన్ని అవమానిస్తున్నారని అన్నారు. అధికారం పోకూడదని, తనయుడిని ముఖ్యమంత్రిని చేయడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచి తర్వాత ప్రయివేటీకరణ గురించి మాట్లాడాలని కిషన్ రెడ్డి కేసీఆర్ కు హితవు పలికారు.

ప్రయివేటీకరణ అందుకే...
ఎయిర్ ఇండియాకు ప్రతి నెల 800 కోట్ల నష్టమొస్తుంటే దానిని టాటా కంపెనీకి ఇచ్చామని చెప్పారు. రాజకీయంగా బీజేపీని విమర్శించాలే కాని, దేశాన్ని విమర్శించకూడదన్నారు. పరిశ్రమలు నష్టపోతే మోదీ ఇంటి నుంచి చెల్లించరని, ప్రజలపై భారం పడుతుందన్న కారణంతోనే కొన్ని సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు కూడా ప్రయివేటీకరణను కోరుకుంటున్నారని అన్నారు. తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు.
రైతు ఆత్మహత్యలు ఎందుకో?
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయిందన్నారు. ఇచ్చిన హామీలను ఏమాత్రం నిలబెట్టుకోలేని కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తారనని బయలుదేరాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. కరీంనగర్ ను అమెరికా చేస్తానని, నిజామాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ ను చేస్తానన్న కేసీఆర్ ఫాం హౌస్ లో ఉండటానికే సమయం వెచ్చిస్తాడన్న విషయం అందరికీ తెలుసునని అన్నారు. తొమ్మిదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.


Tags:    

Similar News