కిడ్నీరోగులకు గుడ్ న్యూస్!

కిడ్నీ రోగులకు శుభవార్త. కృత్రిమ కిడ్నీ తయారీ ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోనే ఉన్న బయో ఆర్టిఫిషియల్‌ కిడ్నీ, త్వరలో పేషెంట్లకు వరప్రసాదంగా మారనుంది. దీనికోసం వైద్యులు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. కృత్రిమ మూత్రపిండాలు అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా కోట్లమందికి సాంత్వన కలుగుతుంది.

Update: 2023-12-31 07:52 GMT

డయాలసిన్‌ కష్టాలకు చెల్లుచీటీ

కిడ్నీ రోగులకు శుభవార్త. కృత్రిమ కిడ్నీ తయారీ ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోనే ఉన్న బయో ఆర్టిఫిషియల్‌ కిడ్నీ, త్వరలో పేషెంట్లకు వరప్రసాదంగా మారనుంది. దీనికోసం వైద్యులు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. కృత్రిమ మూత్రపిండాలు అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా కోట్లమందికి సాంత్వన కలుగుతుంది. జీవన శైలిలో మార్పుల వల్ల ఏటికాయేడు కిడ్నీ రోగులూ కూడా పెరుగుతున్నారు. బీపీ, షుగర్‌ వ్యాధుల కారణంగా శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే ఈ కీలక ఆర్గాన్స్‌ చెడిపోతున్నాయి. దీర్ఘకాలిక, అనువంశిక వ్యాధులు కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్‌కు మరో కారణం. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే జీవితకాలం డయాలసిస్‌ ద్వారా కాలం గడపాల్సిందే. ఇది కాలం, వ్యయం, శ్రమతో కూడుకున్న ప్రక్రియ.

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మరో ప్రక్రియ. ఇది కూడా వ్యయంతో కూడుకున్నదే. చట్ట ప్రకారం రోగి రక్త సంబంధీకులు, జీవిత భాగస్వామి మాత్రమే కిడ్నీ దానం చేయాలి. బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి కిడ్నీని తీసి రోగి శరీరంలో అమరుస్తారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకున్న రోగులకు, వరుస క్రమంలో... మృతుల నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తారు. పపంచవ్యాప్తంగా పది శాతం మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ వారిలో కేవలం పదిహేను శాతానికి మాత్రమే కిడ్నీ దొరుకుతోంది. మిగిలిన వాళ్లంతా డయాలసిస్‌తో కాలం గడుపుతున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తర్వాత కూడా జీవితకాలం ఇమ్యూనో సప్రెసెంట్స్‌ (శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు) వాడాల్సి ఉంటుంది. లేదంటే కొత్త కిడ్నీని శరీరం తిరస్కరిస్తుంది. కథ మళ్లీ మొదటికి వస్తుంది. కొన్నిసార్లు అమర్చిన కిడ్నీ కూడా పనిచేయకపోవచ్చు. అప్పుడు డయాలసిస్‌ చేయించుకుంటూ జీవితాన్ని గడపాలి.

వీళ్లందరికీ యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రోసిస్కో (యూసీఎస్సెఫ్‌) వైద్యులు ఉపశమనం కలిగించే వార్త చెప్పారు. భారత సంతతికి చెందిన వైద్యుడు విషురాయ్‌ ఆధ్వర్యంలో కృత్రిమ కిడ్నీ తయారీ కోసం చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య జరిపిన పరిశోధనలో.. కృత్రిమ కిడ్నీ కణాలను ఓ చిన్న బయోరియాక్టర్‌లో అమర్చారు. ఆ పరికరాన్ని ఓ పంది శరీరంలో ఇంప్లాంట్‌ చేసి, ఓ వారం పాటు పరిశీలించారు.. సహజమైన కిడ్నీలాగే ఆ రియాక్టర్‌ కూడా పనిచేయడం గమనించారు. దీనిని మరింత మెరుగుపరిచి, త్వరలోనే పూర్తిస్థాయిలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది విజయంతమైతే కృత్రిమ కిడ్నీల తయారీ మొదలవుతుంది. ఇది అంత సులువైన పని కాదు. కొంత సమయం పడుతుంది.

కృత్రిమ కిడ్నీల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి విఫలం కావు. ఒకవేళ ఓ పరికరం పని చేయకపోతే.. మరోదాన్ని అమర్చుకోవచ్చు (పేస్‌మేకర్‌లా). ఇది ఇంప్లాంట్‌ చేసిన తర్వాత ఇమ్యూనో సప్రెసెంట్స్‌ కూడా వాడాల్సినవసరం లేదు. ఇతరుల్లా సాధారణ జీవితం గడపవచ్చు. వెరసి కిడ్నీవ్యాధుల కష్టాలన్నీ తీరుతాయి. పేషెంట్లూ కాస్త పాజిటివ్‌గా ఉండండి. ముందున్నాయి.. మంచి రోజులు. 

Tags:    

Similar News