ఎంత ఇష్టంగా చూసినా.. అంత కష్టంగా ఉందా?
ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో ఆళ్ల నాని కాంగ్రెస్ నుంచి గెలిచారు
జగన్ కు అత్యంత ఇష్టుడైన వ్యక్తి. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోయినా పదవి ఇచ్చి అతనికి వెన్ను దన్నుగా నిలిచారు. అయినా మంత్రి పదవి నుంచి తొలగించిన వెంటనే మాత్రం తనకేదో అన్యాయం జరిగినట్లు ఫీలవుతున్నారు. ఆ నేతే ఆళ్ల నాని. మంత్రి పదవి పోయిన నాటి నుంచి పత్తా లేరు. అసలు పార్టీలో ఉన్నారా? అన్నది కూడా పట్టించుకోవడం లేదు. ఏమాత్రం సీరియస్ నెస్ లేని నేతగా వైసీపీ అధినాయకత్వం కూడా అభిప్రాయపడుతుంది. మంత్రి పదవి ఐదేళ్లు పాటు ఉండాలనుకుని తనను తొలగించిన వెంటనే బాగా నిరాశకు లోనయినట్లుంది.
మూడు సార్లు...
ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో ఆళ్ల నాని కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆళ్ల నాని ఓటమి పాలయ్యారు. దీంతో జగన్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆళ్ల నానికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు పార్టీ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించి అప్పటి మున్సిపల్ ఛైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్ కు ఇచ్చినా ఆ ఎన్నికలలో టిక్కెట్ మాత్రం ఆళ్ల నానికే ఇచ్చారు. అంతగా నానికి జగన్ ప్రాధాన్యత ఇచ్చారు.
మూడేళ్లు మంత్రిగా...
ఇక 2019 ఎన్నికల్లో అంతటి జగన్ ప్రభంజనంలోనూ ఆళ్ల నాని కేవలం మూడు వేల మెజారిటీతోనే విజయం సాధించారు. తొలి మంత్రివర్గంలోనే చోటు కల్పించారు. కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను కేటాయించారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేశారు. మూడేళ్ల పాటు పదవిలో ఆళ్ల నాని కొనసాగారు. కరోనా సమయంలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా జగన్ పట్టించుకోలేదు. అప్పటి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముందు ఆళ్ల నాని తేలిపోయాడని భావించినా జగన్ మాత్రం నానిని వెనకేసుకొచ్చారు. బాగా పనిచేశావంటూ అనేక సార్లు కితాబిచ్చారు. అయితే అందరితో పాటు ఆళ్లనానిని కూడా మంత్రి పదవి నుంచి తొలగించారు.
తొలగించారని...
మంత్రి వర్గ విస్తరణలో జగన్ ఎవరినీ స్పేర్ చేయలేదు. కొడాలి నాని ఒకే ఒక కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యే అయినా ఆయనను కూడా తొలగించారు. కాని మంత్రి పదవి పోయిన నాటి నుంచి పత్తా లేకుండా పోయారు. గడప గడపకు ప్రభుత్వం కార్కక్రమంలో కూడా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదో పాల్గొని మమ అనిపిస్తున్నారు. ఇటీవల కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలందరూ రాజమండ్రిలో సమావేశమయినా ఆళ్ల నాని మాత్రం దూరంగానే ఉన్నారు. మంత్రి పదవి ఎవరికి శాశ్వతం కాదు. జగన్ ముందు చెప్పినట్లే 90 శాతం తొలగించి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పిన విషయాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలవాలంటే యాక్టివ్ అవ్వాలి. క్యాడర్ కు అందుబాటులో ఉండాలి. అప్పుడే మళ్లీ గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కాగలుగుతారు. ఇలా అలిగి ఇటు పార్టీకి, అటు క్యాడర్ కు దూరమయితే అసలుకే మోసం రాక తప్పదు.