Chandrababu : ఏపీ ప్రజలకు చంద్రబాబు కొత్త ఏడాది చెప్పే తీపికబుర్లు ఇవేనట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఏడాది ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు

Update: 2024-12-18 08:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఏడాది ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఏదైనా ఒక ప్రభుత్వానికి ఆరు నెలలు మాత్రమే హనీమూన్ పీరియడ్. ఆరు నెలల్లో గత ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు కొంత ఆలోచిస్తారు. నిజమేకావచ్చు అని కొంత ప్రభుత్వం పట్ల సానుకూలతతో ఉంటారు. అదే చెప్పిందే చెబుతూ ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేస్తుంటే ఆరు నెలలు తర్వాత జనం పట్టించుకోవడం మానేస్తారు. ఇది ఏపీలో మాత్రమే కాదు. ఎక్కడైనా ఇదే జరుగుతుంది. తాము చేయాల్సింది చేయకుండా గత ప్రభుత్వంపై తప్పులు మోపి తప్పించుకోవాలన్న అపప్రధను ఎవరైనా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ విషయం నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఆయన జనవరి నెల నుంచి ఇక స్పీడప్ చేయాలని భావిస్తున్నారు.


ముద్ర చెరిపేసుకోవడానికి...

చంద్రబాబు నాయుడు అంటే ఒక ముద్ర పడిపోయింది. ఆయన అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యత సంక్షేమానికి ఇవ్వరన్నది అందరూ అనుకునేదే. అదే ఏపీలోనూ ఇప్పుడూ అనుకుంటున్నారు. ఖజానాలో డబ్బులు లేవని ఒకవైపు చెబుతూనే మరొక వైపు వేల కోట్ల రూపాయలు వెచ్చింది అమరావతి రాజధాని నిర్మాణపనులు చేపడుతుండటం కూడా ప్రజలను ఆలోచనలో పడేస్తుంది. తాము ఎన్నిమంచి పనులు చేసినా, విజన్ తో ఆలోచించినా ప్రజలు ఇన్ స్టెంట్ ప్రయోజనాలను మాత్రమే కోరుకుంటారు. వారు ఆశించింది దక్కకుంటే వెంటనే రివర్స్ అవుతారు. ఇప్పుడు ఏపీలోనూ జరుగుతున్నదంతే. ఆరు నెలల కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంపై ప్రజలు పెదవి విరిచే పరిస్థితికి వచ్చారు. రాజధాని నిర్మాణం జరిగితే తమకేంటి? పోలరవం ప్రాజెక్టూ పూర్తయితే తమకు ఒరిగేందేంటి? న్న ధోరణిలో పేద, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు.
వచ్చే నెల నుంచి...
దీంతో వచ్చే నెల నుంచి సంక్షేమంపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవైపు అమరావతి, పోలవరం పనులను జనవరి నెల నుంచి ప్రారంభిస్తుండటంతో అదే నెలలో సంక్షేమ పథకాలను కూడా పెద్ద సంఖ్యలో అమలు పర్చాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అప్పుల కోసం మరికొంత వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడమే కాకుండా, అవసరమైన నిధులను కూడా తెచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తాము ఇచ్చిన ముఖ్యమైన పథకాలను అమలు చేసేందుకు కావాల్సిన నిధులపై స్టడీ చేసి నివేదికను ఈ నెలాఖరులోగా ఇవ్వాలంటూ ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. వారిచ్చే నివేదికలను బట్టి సంక్షేమ పథకాలను జనవరి నెల నుంచివరసగా అమలు చేసేందుకు చంద్రబాబు రెడీ అయిపోతున్నారు.
రైతులకు కూడా...
ముందుగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇది బహుశ సంక్రాంతి నుంచి అమలు చేసే వీలుంది. కొత్త ఏడాదిలో తల్లికి వందనం కూడాఅమలు చేయనున్నారు. తర్వాత వెనువెంటనే రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఇరవై వేల రూపాయలు కూడా ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటి వరకూ ధాన్యంకొనుగోలు చేయడం తప్పించి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఏపీలోని ప్రధాన వర్గమైన అన్నదాతలు అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబు గ్రహించారు. మహిళలకు ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్నిఅమలు చేస్తూ, ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులోకి తెస్తే వారు తమను వీడివెళ్లరని భావిస్తున్నారు. అదే సమయంలో రైతులను ఆకట్టుకోవడానికి కూడా రైతు భరోసా నిధులను కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తే వారు కూడా తమ పాలన పట్ల సంతృప్తి చెందుతారన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు పాలనలో జనవరి నుంచి సంక్షేమంతో పరుగులు పెట్టించనున్నారన్నది ప్రభుత్వవర్గాల నుంచి అందుతున్నసమాచారం.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News