పొత్తులతో టీడీపీలో చెదురుతున్న ఆశలు
వచ్చే ఎన్నికల్లో పొత్తులతో కొందరు టిక్కెట్లు కోల్పోయే అవకాశముంది. ఈ మేరకు చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు
వచ్చే ఎన్నికల్లో పొత్తులతో కొందరు టిక్కెట్లు కోల్పోయే అవకాశముంది. అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని చంద్రబాబు కొందరికి హామీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. ప్రధానంగా జనసేన, టీడీపీ పొత్తుతో టీడీపీకి చెందిన నేతలు పలువురు ఈ దఫా పోటీలో ఉండే అవకాశాలు కన్పించడం లేదు. ఈసారి చంద్రబాబు పక్కాగా సామాజిక సమీకరణాలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సొంత సామాజికవర్గం నేతలను కొంత వెనక్కు నెట్టి మిగిలిన బలమైన కులాల వారికి టక్కెట్లు ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు.
దామచర్లకు...
మిగిలిన కులాల వారిని తమ పార్టీ వైపునకు తిప్పుకునేందుకు ఈ మాత్రం సాహసం చేయకతప్పదు. ఒంగోలు శాసనసభ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ కమ్మ సామాజికవర్గానికి చెందిన దామచర్ల జనార్థన్ ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో తొలిసారి ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఆయనకు టిక్కెట్ దక్కే అవకాశం లేదంటున్నారు.
శిద్ధాను పార్టీలోకి తీసుకుని....
జనసేన ఒంగోలు టిక్కెట్ కోరినా దాని బలం అక్కడ అంతంత మాత్రమే. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో సామాజికపరంగా, ఆర్థికంగా బలమైన నేత శిద్ధారాఘవరావు, ఆయన తన వ్యాపారాల కోసం వైసీపీలో చేరినా ఆయన మనసంతా టీడీపీపైనే ఉంది. వైసీపీలో ఆయన యాక్టివ్ గా కూడా లేరు. జిల్లాలో వైశ్య సామాజికవర్గానికి ఒక సీటు కేటాయించాలన్నది చంద్రబాబు ఆలోచన. 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో శిద్ధారాఘవరావు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి అయ్యారు కూడా. అయితే ఈసారి దర్శి కంటే ఒంగోలు సీటు శిద్ధాకు ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది.
దర్శి జనసేనకు...
దర్శి సీటును జనసేన కు కేటాయించే అవకాశాలున్నాయి. జిల్లాలో వైశ్య సామాజికవర్గానికి ఇక ఎక్కడా సీటు కేటాయించే అవకాశాలు లేవు. శిద్ధారాఘవరావుకు కులపరంగా మంచి పేరుంది. ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లరు. అందుకే ఒంగోలు సీటును శిద్ధా రాఘవరావుకు చంద్రబాబు ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతుంది. ఒంగోలుతో పాటు ఆయన మరో రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఆర్థికంగా ఆదుకునేలా ఏర్పాటు చేశారంటున్నారు. దామచర్ల జనార్థన్ కు మరి చంద్రబాబు టిక్కెట్ ను వేరే చోటయినా కేటాయిస్తారా? లేక అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ అంటూ హామీ ఇస్తారా? అన్నది చూడాల్సి ఉంది.