మైనర్ భార్యతో శృంగారం కూడా అత్యాచారమే!!

మైనర్ భార్య ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం కూడా అత్యాచారంగా

Update: 2024-11-15 08:10 GMT

మైనర్ భార్య ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం కూడా అత్యాచారంగా పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు తెలిపింది. అలాంటి చర్యకు సంబంధించి చట్టపరమైన రక్షణ ఇవ్వడం కుదరదని తెలిపింది. తన భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తికి పదేళ్ల శిక్షను సమర్థిస్తూ హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. "18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారం అని పేర్కొనాలి, ఆమె వివాహం చేసుకున్నదా లేదా అనే దానితో సంబంధం ఉండదు” అని హై కోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అమ్మాయి వివాహం చేసుకుందా? లేదా? అన్న దానితో సంబంధం లేకుండా 18 ఏళ్లలోపు ఉన్న మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారంగానే పరిగణించాలని జస్టిస్ జేఏ సనప్‌ తెలిపారు.

ఈ కేసును పరిశీలిస్తే.. పెళ్లికి ముందు తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్ల గర్భం దాల్చాల్సి వచ్చిందని బాధిత మహిళ కోర్టుకెక్కింది. వారికి వివాహమైనప్పటికీ, కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అనంతరం ఆమె భర్తపై కోర్టుకెక్కింది. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన బాధితురాలు తండ్రి, సోదరి, నానమ్మతో కలిసి నివసిస్తోంది. 2019లో ఆమె ఫిర్యాదు చేయడానికి ముందు మూడు నాలుగేళ్లపాటు ఆ వ్యక్తితో ఉంది. ఈ క్రమంలో వారి మధ్య లైంగిక సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత వివాహం చేసుకున్నప్పటికీ గర్భాన్ని తొలగించుకోవాలని భార్యపై అతడు ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఆమెపై భౌతిక దాడికి పాల్పడటమే కాక, ఆ బిడ్డ వేరే వ్యక్తి వల్ల కలిగిందని నిందించాడు. దీంతో ఆమె 2019లో పోలీసులను ఆశ్రయించగా నిందితుడు అరెస్టయ్యాడు. ఇక ఆమెకు పుట్టిన బిడ్డకు డిఎన్ఏ పరీక్ష చేయించగా, వీరిద్దరే తల్లిదండ్రులని కూడా తేలింది.


Tags:    

Similar News