ఢిల్లీ టూర్....? మ్యాప్ దొరికేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీజీపీ నుంచి రూటు మ్యాప్ ఇంకా లభించలేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీజీపీ నుంచి రూటు మ్యాప్ ఇంకా లభించలేదు. పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో తాను బీజేపీ రూటు మ్యాప్ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కానీ ఇంతవరకూ బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి జనసేన అధినేతకు ఎలాంటి రూట్ మ్యాప్ రాలేదు. ఈ నెల 6వ తేదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా బీజేపీ నుంచి ఏదైనా కొంత సిగ్నల్స్ వస్తాయోమోనని ఎదురు చూస్తున్నారు. అయితే నడ్డాతో నేరుగా మాట్లాడేందుకు పవన్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
స్వయంగా కలిసి.....
తాను త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను స్వయంగా కలవాలని పవన్ భావిస్తున్నారు. వారిని కలసి ఏపీలో రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలు, కులాల మధ్య పోరు, అభివృద్ధి లేకపోవడం వంటి విషయాలను వివరించి టీడీపీతో కలసి వెళ్లాలని బీజేపీ అగ్రనేతలను పవన్ కోరనున్నారు. మూడు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి రావచ్చని, ఎంపీ సీట్లు కూడా అధిక సంఖ్యలో సాధించే అవకాశాలను వివిధ సర్వే నివేదికల ద్వారా అగ్రనేతల ముందు పవన్ ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీని ఒప్పించి...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అందుకు టీడీపీతో కలసి నడిచేందుకు ఆయన ఎప్పుడో డిసైడ్ అయ్యారు. తనతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండగా ఉంటే మరి కొంత బలం పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో పవన్ ఉన్నారు. బీజేపీ అగ్రనేతలను తాను ఒప్పించగలనన్న విశ్వాసంతో పవన్ ఉన్నారు. బీజేపీకి ఏపీలో పెద్దగా ఓటు బ్యాంకు లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సయితం బీజేపీతో మైత్రిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రంలో ఉన్న అగ్రనేతల అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
రెండేళ్లు ఉన్నా.....?
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. రెండేళ్ల ముందే పొత్తులపై ఒక స్పష్టత వస్తే పార్టీ క్యాడర్ లోనూ కొంత స్పష్టత వస్తుందని జనసేనాని భావిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయాలన్నది పవన్ ఆలోచన. అప్పుడే పార్టీల ఓటు బ్యాంకు సాలిడ్ అవుతుందన్నది భావన. అందుతున్న సమాచారం మేరకు ఈ నెలలోనే పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఉంటుందని తెలుస్తోంది. అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసే విషయంలో కొంత సందిగ్దత అయితే ఉంది. అగ్ర నాయకత్వం ఏ మేరకు అంగీకరిస్తుందన్న సందేహమూ లేకపోలేదు. బీజేపీ ఈ విషయంలో కలసి రాకపోతే తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు కూడా పవన్ సిద్ధమవుతున్నారు. అందుకోసమే ఎంత వేగంగా వీలయితే అంత పొత్తులపై స్పష్టత రావాలన్నది జనసేనాని ఆలోచన. మరి పవన్ ఢిల్లీ టూర్ తో రూట్ మ్యాప్ లభిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.