బాబుపై కేవీపీ ఫైర్

మూడేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని పోరాడుతున్న తాను చంద్ర‌బాబు ద‌గ్గ‌ర నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న ప్ర‌త్యేక [more]

Update: 2019-02-13 07:09 GMT

మూడేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని పోరాడుతున్న తాను చంద్ర‌బాబు ద‌గ్గ‌ర నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఒంట‌రిగా ధ‌ర్నా చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌పై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తాను రాజ్య‌స‌భ‌లో ఒక్క‌డినే పోరాటం చేస్తున్నాన‌ని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ కూడా ఆన్ రికార్డు చెప్పార‌ని గుర్తు చేశారు. ఆ మాత్రం గ్ర‌హింపు కూడా చంద్ర‌బాబుకు లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. తాను చంద్ర‌బాబుతో పోల్చుకునేంత పెద్ద‌వాడిని కాద‌ని, అయితే, పార్టీ ప‌ట్ల త‌న నిబద్ధ‌త‌ను మాత్రం ఎవ‌రూ శంకించ‌లేర‌న్నారు. విద్యార్థి ద‌శ నుంచి ఒకే పార్టీలో ఉన్నాన‌ని అన్నారు. రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రిగా చూడాల‌ని వైఎస్సార్ చివ‌రి మాట‌గా చెప్పారని, అది ఆయ‌న మ‌ర‌ణ‌శాస‌నం లాంటి మాట అన్నారు. వైఎస్ క‌ల నెర‌వేరే వ‌ర‌కు తాను రాజ‌కీయాల్లో, కాంగ్రెస్ లోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు, కాంగ్రెస్ కి మ‌ధ్య అగాదం సృష్టించాల‌ని చంద్ర‌బాబు ద‌య‌చేసీ ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని, ఆయ‌న తెలివితేట‌లు త‌న‌లాంటి చిన్న‌వారిపై ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని కోరారు. కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్యే అగాదం పెట్ట‌డంలో చంద్ర‌బాబు దిట్ట అన్నారు.

చంద్ర‌బాబుది ఓవ‌ర్ యాక్ష‌న్‌

చంద్ర‌బాబు త‌న‌కున్న వ‌న‌రులు, ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి నిన్న పోరాటం చేశాన‌ని చెబుతున్నార‌ని, ఇదే పోరాటాన్ని మూడేళ్ల క్రిత‌మే కాంగ్రెస్ చేసింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఇవాళ క‌ళ్లు తెరిచిన చంద్రబాబు.. త‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని పేర్కొన్నారు. మూడేళ్ల నుంచే రాష్ట్రం కోసం పోరాడుతున్న తాను చంద్ర‌బాబు నుంచి నేర్చుకోవాల్సిన ప‌ని లేద‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు నిన్న చేసిన మ‌ట్టి కుండ‌ల నిర‌స‌న‌ 2016 మార్చిలోనే మ‌ట్టి కుండ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌తో తాము నిర‌స‌న తెలిపితే ఇవాళ చంద్ర‌బాబు అటువంటి నిర‌స‌న చేస్తున్నార‌ని అన్నారు. త‌న ఆత్మ‌న్యూన్య‌త భావాన్ని, అప‌రాధభావాన్ని త‌ప్పించుకోవ‌డానికి చంద్ర‌బాబు ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. త‌న ప్రైవేటు మెంబ‌ర్ బిల్లుకి 14 మంది మ‌ద్ద‌తును కాంగ్రెస్ కూడ‌గ‌ట్టింద‌ని, ఇప్పుడు చంద్ర‌బాబు వ‌చ్చి క‌లిశార‌ని అన్నారు. చంద్ర‌బాబుకు కాంగ్రెస్‌తో క‌ల‌వ‌డం ఒక‌రోజు చారిత్ర‌క అవ‌స‌రంలా, మ‌రోరోజు జాతీయ ప్ర‌యోజ‌నాలుగా క‌నిపిస్తుంద‌ని, త‌న‌కు మాత్రం కాంగ్రెస్‌, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌న్నారు. ప‌క్క‌నే దేవెగౌడ‌ను, బుద్ధ‌దేవ్ బ‌ట్టాచార్య‌, అద్వానీ వంటివారిని పెట్టుకొని చంద్ర‌బాబు తానే సీనియ‌ర్‌ను అని చెబుతార‌ని ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు వ్య‌వ‌హారం వైష్ణ‌వుల‌కు నామాలు పెట్టిన‌ట్లు ఉంద‌న్నారు.

Tags:    

Similar News