‘‘పేదల కంట కన్నీరు లేని తెలంగాణ నా ఆశ.. ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం... కోటి ఎకరాలకు నీరివ్వడమే నా యజ్ఞం... ఈ యజ్ఞం ఆగవద్దు... తెలంగాణ గెలవాలి’’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన చివరి ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ... కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణను మళ్లీ బానిసను కానివ్వనని, ఇప్పటికే ఒకసారి చంద్రబాబును కొడితే కరకట్టకు పడ్డాడని.. ఈసారి ప్రజలే ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ పాలనను చూసి ఓట్లేయాలని... నవ్వెవాడి ముందు జారి పడవద్దని... ఓట్లనగానే గందరగోళానికి గురికావద్దని... దాచి దాచి దయ్యాల పాలు చేయవద్దని కోరారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతోందని, తానును వేసిన విత్తనాలు మొలకెత్తి పూతపూసి కాయ కాసే సమయం ఇప్పుడే వచ్చిందని ప్రజలు ఆలోచించి ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు. గజ్వేల్ సభలో కేసీఆర్ ప్రసంగంలోని కీలక అంశాలు...
- టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణకు కాళేశ్వరం... కూటమి గెలిస్తే తెలంగాణకు శనేశ్వరం వస్తుంది. ఏది కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి.
- కోదాడ సభలో కృష్ణ నదిలో నీళ్లు లేవని, గోదావరి నీళ్లు పంచుకుందామని చంద్రబాబు... రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల ముందే కోదాడలో అన్నారు. దీనికి కాంగ్రెస్ గొర్రెలు తలలు ఊపుతున్నారు.
- దొంగ సర్వేలు వస్తాయి. గోల్ మాల్ కావద్దు. గజ్వేల్ లో డిక్లేర్ చేస్తున్న టీఆర్ఎస్ 100 సీట్లకు పైగా గెలవబోతోంది. గజ్వేల్ లో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుంది. గజ్వేల్ లో తాను గెలవడం ఖాయం... రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలవడం ఖాయం.
- తెలంగాణ యావత్తు ప్రజానికం మాకు వాటా లేదా అని ఓటుతో వారికి జవాబు చెప్పాలి. మన గడ్డ మీద నిలబడి కృష్ణా నదిలో నీళ్లు లేవని చంద్రబాబు మాయమాటలు మాట్లాడుతున్నాడు.
- తెలంగాణలో ఆయన నడిపే కీలుబొమ్మ ప్రభుత్వం కావాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఎవరున్నా సరే కానీ కేసీఆర్ మాత్రం ఉండొద్దని అనుకుంటున్నారు. కేసీఆర్ హక్కులు కోల్పోనివ్వడు కాబట్టి టీఆర్ఎస్ గెలవద్దని అనుకుంటున్నాడు. గొడ్డలి భుజం మీద పెట్టుకుని తిరుగుతున్నారు ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలి.
- అక్రమంగా సంపాదించిన వేల కోట్లు, ఆంధ్రా నాయకులు, ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంటును చంద్రబాబు ఇక్కడ మొహరించారు.
- మనం అమాయకులమని, డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చని చంద్రబాబు ఇంకా అనుకుంటుంటే దద్దమ్మ కాంగ్రెస్ వంతపాడుతుంది.
- కాంగ్రెస్, చంద్రబాబు అనే రెండు కత్తులు తెలంగాణ ప్రజల మీదకు వస్తున్నాయి... తెలంగాణకు ప్రమాదం పొంచి ఉంది.
- తెలంగాణ ఏర్పడగానే సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకుని ముసిముసి నవ్వులు నవ్విన దుర్మార్గుడు చంద్రబాబు. అయినా తట్టుకున్నాం. ఇవాళ దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.
- దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమానికి 43 వేల కోటలు ఖర్చు చేస్తున్నాం.
- అధికారం లేకపోతే కాంగ్రెస్ నేతలు బతకలేరు. చంద్రబాబు - రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వస్తే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గొర్రెల్లా తిరుగుతున్నారు.