Weather Report : చలి తీవ్రత మరింత పెరిగిందిగా.. పొగమంచుతో ఇబ్బందులేనా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.;
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి చలి తీవ్రత అధికంగానే ఉంది. బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఉదయం పది గంటల వరకూ చలి గాలుల తీవ్రత తగ్గడం లేదు. చెవులు సయితం దిమ్మెత్తిపోతున్నాయి. మంకీ క్యాప్ లు, స్వెట్టర్లు ధరించినప్పటికీ చలి తగ్గడం లేదు. ఎముకల కొరికే చలి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అరకులో అత్యల్పంగా...
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతుండగా ఏజెన్సీ ప్రాంత ఏరియాల్లో మాత్రం 9 నుంచి పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కాదు రాయలసీమలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అరకులో 3.8 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు. దీంతో అరకు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఆదిలాబాద్, కుమురం భీం, మెదక్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉదయం నుంచి పది గంటల వరకూ పొగమంచు కూడా ఎక్కువగా ఉండటంతో సంక్రాంతికి సొంత కార్లలో బయలుదేరిని వారు ఇబ్బందులు పడుతున్నారు. దారి కనిపించడం లేదు. విజిబులిటీ తక్కువగా ఉండటంతో నెమ్మదిగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరికొద్ది రోజులు చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.