Yanmala Ramakrishnudu : టీడీపీలో యనమల ప్రస్థానం ఇక ముగిసినట్లేనా? సీన్ అలాగే ఉంది మరి
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు.;
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసేందుకే అధినాయకత్వం డిసైడ్ అయింది. అందుకే ఇటీవల బీసీ మంత్రాలను జపిస్తుంది. చీఫ్ సెక్రటరీ విజయానంద్ నియమాకం తర్వాత జరిగిన మీడియా చిట్ చాట్ లో చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం బీసీలకు ఉన్నత స్థానాలు కల్పిస్తుందని చెప్పడం వెనక కూడా యనమలను సాగనంపే కార్యక్రమం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. డీజీపీ, చీఫ్ సెక్రటరీలతో పాటు టీటీడీ ఈవోలుగా బీసీలను నియమించిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా యాక్టివిస్టులు హోరెత్తిస్తున్నారు. దీనికి కారణం యనమలేనని చెప్పకతప్పదరు.
అగ్రనాయకత్వం ఆగ్రహం...
ఇటీవల యనమల రామకృష్ణుడి వైఖరి పార్టీ అగ్రనాయకత్వానికి మింగుడుపడటం లేదు. ఎంత చేసినా యనమలకు తృప్తి లేదని, ఆయన కుటుంబీకులకు తగిన గౌరవం ఇచ్చి పదవులు కట్టబెట్టినా మంత్రి పదవో? రాజ్యసభ పదవో రాలేదన్న అక్కసును ఆయన పార్టీ మీద వెళ్లగక్కడం ఏంటన్న ప్రశ్న అధినాయకత్వం నుంచి వస్తుంది. అందుకే యనమల రామకృష్ణుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదన్నది అమరావతి వర్గాల టాక్. ఆయన పలుమార్లు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా కూడా అందుకు సమయం ఇవ్వలేదని ముఖ్యనేతలు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం యనమల రామకృష్ణుడిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని అర్థమవుతుంది.
బీసీ నినాదంతో...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకినాడ పోర్టు విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ యనమల రామకృష్ణుడు గళమెత్తిన దగ్గర నుంచి ఆయనను అందరూ నేతలు దూరం పెడుతున్నారు. అధినాయకత్వం ఆలోచననలు పసిగట్టిన తూర్పు గోదావరి జిల్లా నాయకులు కూడా యనమల వద్దకు వచ్చేందుకు జంకుతున్నారు. తాము యనమలను కలిశామని తెలిస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏమయిపోతుందనన్నభయం గోదావరి జిల్లా నేతల్లో ఉంది. యనమల రామకృష్ణుడు కూడా ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. బీసీల వాయిస్ ను వినిపించేందుకు ఆయన రెడీ అవుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు దానికి ముందే విరుగుడు కనిపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
భవిష్యత్ లో ఏ పదవి...
అందిన సమాచారం ప్రకారం యనమల రామకృష్ణుడికి ఇక పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏ పదవీ లభించే అవకాశాలు మాత్రం లేవు. ఆయన ప్రస్తుతం మండలి సభ్యులుగా ఉన్నారు. అది ముగిసిన తర్వాత ఆయనకు రెన్యువల్ చేసే ఆలోచన కూడా చంద్రబాబుకు లేదట. ఆయన స్థానంలో మరొక బలమైన బీసీనేతకు ఆ పదవి అప్పగించాలన్న యోచనలో టీడీపీ చీఫ్ ఉన్నట్లు సమాచారం. యనమల రామకృష్ణుడు పార్టీ గీత దాటి తప్పు చేశారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు తలొగ్గి ఇప్పుడు పదవులు అప్పగిస్తే భవిష్యత్ లో పార్టీకి ఇబ్బందికరంగా మారతారన్న అభిప్రాయం బలంగా వేళ్లూనుకుంది. అందుకే యనమలను పార్టీ నుంచి సాగనంపేందుకు స్కెచ్ సిద్ధమయిందంటున్నారు. ఆయనంతట ఆయనే పార్టీనుంచి తప్పుకునేలా వాతావరణాన్ని ఇప్పటికే కల్పించారన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్.