Sankranthi : సంక్రాంతికి ఊరెళుతున్నారా? అయితే మీ జేబులు గుల్ల అయినట్లేగా?

సంక్రాంతికి ఊరు వెళ్లే వారు తమ జేబులు నిండుగా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ప్రయాణ ఛార్జీలు మామూలుగా పెరగలేదు;

Update: 2025-01-10 08:03 GMT

సంక్రాంతికి ఊరు వెళ్లే వారు తమ జేబులు నిండుగా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ప్రయాణ ఛార్జీలు మామూలుగా పెరగలేదు. ప్రయివేటు, ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరగడంతో సంక్రాంతి ఊరికి వెళ్లక ముందే కనిపిస్తుంది. హైదరాబాద్ నగరం నుంచి సంక్రాంతి పండగకు లక్షలాది మంది జనం సొంతూళ్లకు వెళుతుంటారు. కేవలం ఏపీలోని వారు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లి పండగ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతారు. సంక్రాంతి వేళ హైదరాబాద్ నగరం బోసిపోయి కనిపిస్తుంది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోతాయి. రేపటి నుంచి పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించడంతో నేటి నుంచి సంక్రాంతికి సొంతూళ్లకు పయనమయ్యే వారి సంఖ్య మొదలయింది.

ఆర్టీసీ బస్సుల్లోనూ...
సంక్రాంతికి వెళ్లే ప్రత్యేక బస్సుల్లో వెళ్లాలంటే సాధారణ ఛార్జీల కంటే అదనంగా యాభై శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 10, 11, 12, 19, 20.. ఈ ఐదు రోజుల పాటు అదనపు ఛార్జీలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సంక్రాంతి పండగకు వివిధ ప్రాంతాలకు నడిచే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా ఉంటుందని స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈరోజు ఉదయం నుంచే...
ఉదయం నుంచే బస్టాండ్ లన్నీ రద్దీగా మారిపోయాయి. రైళ్లలో టిక్కెట్ దొరకని వాళ్లు తర్వాత ప్రయారిటీ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తారు. వాటిలో కూడా టిక్కెట్లు దొరకకపోతే ఇక ప్రయివేటు బస్సులను ఆశ్రయించక తప్పదు. విజయవాడకు సాధారణ రోజుల్లో అయితే వెయ్యి రూపాయల వరకూ ప్రయాణ ఛార్జీ ఉంటుంది. అయితే అది ఇప్పుడు పదిహేను వందల నుంచి రెండు వేల వరకూ పలుకుతుంది. విశాఖపట్నం వెళ్లాలంటే ఐదువేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పటికిప్పుడు ఏపీలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతికి వెళ్లాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందేనంటున్నారు. ప్రభుత్వ సర్వీసులే అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంటే ఇక ప్రయివేటు ట్రావెల్స్ మాత్రం ఎందుకు ఊరుకుంటాయి. అవి కూడా విపరీతంగా పెంచేయడంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఊళ్లకు అనేక మంది ఇక సొంత వాహనాల్లో బయలుదేరే వారు కూడా అధికంగానే ఉన్నారు.


Tags:    

Similar News