చినబాబుకు ఆ బాధ్యతలు చాలట

తెలుగుదేశంలో నారా లోకేష్ నాయకత్వం అనివార్యం కావచ్చు. చంద్రబాబు అనంతరం లోకేష్ చేతుల్లోకే పార్టీ పగ్గాలు వచ్చి చేరతాయి

Update: 2022-04-01 04:37 GMT

తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వం అనివార్యం కావచ్చు. చంద్రబాబు అనంతరం లోకేష్ చేతుల్లోకే పార్టీ పగ్గాలు వచ్చి చేరతాయి. దానిని ఎవరూ కాదనలేరు. తప్పు పట్టలేరు కూడా. అయితే ఈ ఎన్నికలకు మాత్రం నారా లోకేష్ ను ఒకింత దూరం పెట్టాలన్నది చంద్రబాబు యోచన. టీడీపీ లోె నాయకత్వ సమస్య ప్రస్తావన రాకుండా ఉండాలంటే లోకేష్ ను కొంత పార్టీ ముఖ్య నిర్ణయాలకు దూరంగా ఉంచాల్సి ఉంటుంది.

డైలాగులు బాగానే ఉన్నా....
అయితే ఇటీవల జరిగిన పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవంలో లోకేష్ ప్రసంగాన్ని చూసి చినబాబు లో ఎంతమార్పు? అని ఆశ్చర్యపోయారు. నిజమే కార్యకర్తల్లో జోష్ నింపడానికి లోకేష్ ప్రసంగం ఉపయోగపడి ఉండవచ్చు. తాను ఎన్టీఆర్ లా దేవుడిని కాదని, చంద్రబాబులా రాముడిని కాదని, మూర్ఖుడినని అన్నారు. అమెరికాలో ఉన్నా, ఐవరీ కోస్టుకు వెళ్లినా టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించిన వారిని వదిలపెట్టేది లేదని, వెంటాడతానని లోకేష్ ఆవేశంగా ప్రసంగించారు.



 


క్యాడర్ ను ....
కానీ స్క్రిప్ట్ లో పంచ్ డైలాగులు ఉన్నప్పటికీ, లోకేష్ పలికిన తీరు, చూపించిన హావభావాలు ఆకట్టుకోలేకపోయాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ టీడీపీ నాయకత్వం క్యాడర్ ను పట్టించుకోదన్న విమర్శ ఉంది. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే కార్యకర్తే దైవం అంటారని, ఇటువంటి డైలాగులతో లోకేష్ క్యాడర్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్నది విశ్లేషకుల భావన. తనను తాను మూర్ఖుడిగా చెప్పుకుంటూ కార్యకర్తలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశారు తప్పించి, ప్రజలను దూరం చేసుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
సీనియర్ నేతలు మాత్రం...
లోకేష్ తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో నిర్ణయాధికారం అంతా పరోక్షంగా తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు కనపడుతుంది. లోకేష్ నాయకత్వంపై పార్టీలోని సీనియర్ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏపీలో ఆయనకు అప్పగించడాన్ని కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి కూడా లోకేష్ ను దూరంగా ఉంచితే మంచిదని, లోకేష్ కు మిగిలిన బాధ్యతలను అప్పగించితే మంచిదన్న సూచనలు విన్పిస్తున్నాయి. మరి లోకేష్ ఈ ఎన్నికలను ఉపయోగించుకుని నాయకత్వ బాధ్యతలను తీసుకోవాలని భావిస్తున్న తరుణంలో సీినియర్ల సూచనలను చంద్రబాబు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.


Tags:    

Similar News