జగన్ ది మేకపోతు గాంభీర్యమేనా?
ఏపీలో వైసీపీ పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ మాత్రం 87 శాతం మందికి పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తున్నా మంటున్నారు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థిితి ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ మాత్రం 87 శాతం మందికి పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తున్నా మంటున్నారు. పైకి గాంభీర్యతను జగన్ ప్రదర్శిస్తున్నారా? వాస్తవానికి క్షేత్రస్థాయిలో వైసీీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి భావన నెలకొందన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిజానికి అధికారంలో ఉన్న పార్టీకి కొంత వ్యతిరేకత ఉండటం సహజమే. అయితే అది ఏ స్థాయిలో ఉందన్నది అంచనా వేయాల్సి ఉంది. కొద్దో గొప్పో వ్యతిరేకత ఉంటే పరవాలేదు. కానీ అంచనాలకు మించి ఉన్న వ్యతిరేకత ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు.
పైకి ధీమాగా కన్పించినా...?
జగన్ పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. నిన్న గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ లోనూ జగన్ ధీమాగా కన్పించారు. 175 స్థానాలను గెలుచుకుంటామన్న విశ్వాసాన్ని ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవన్నది ఐప్యాక్ టీం ఇచ్చిన నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలు అందుతున్నప్పటికీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు ఆ నివేదికలో చెప్పారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి ప్రజలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలపై ప్రజలు మండి పడుతున్నారు. విద్యుత్తు ఛార్జీల పెంపుదల, కరెంటు కోతలు, అభివృద్ధి లేకపోవడం, రహదారుల పరిస్థితి అద్వాన్నంగా ఉండటం, పోలవరం పూర్తి కాకపోవడం వంటి అంశాలు వివిధ వర్గాల్లో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరగడానికి కారణమయ్యాయని నివేదికలో పేర్కొన్నారు.
సమస్యల పరిష్కరానికి...
అయితే ఈ విషయాలపై జగన్ ఎక్కడా వర్క్ షాప్ లో బయటపడకుండా, ఎమ్మెల్యేలు ఎనిమిది నెలల పాటు ప్రజల్లో ఉండాలని ఒక టాస్క్ ఇచ్చారు. ప్రధాన సమస్యలను పరిష్కరించాలంటే నిధులు అవసరమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీీపీ సర్కార్ కు నిధుల సమీకరణ కష్టంగానే మారుతుంది. అన్ని సమస్యలను పరిష్కరించడానికి జగన్ కు రెండేళ్ల సమయం సరిపోతుందా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఎన్టీఆర్ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా వెంటనే ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. కేవలం సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా సమానంగా ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. ప్రస్తుతం అన్ని వర్గాల్లో వ్యతిరేకత కన్పిస్తుందని ఐ ప్యాక్ టీం నివేదిక సమర్పించినట్లు తెలిసింది.
ఎమ్మెల్యేల మౌనం...
ఇప్పుడు వైసీపీలో నేతల మనసులో కూడా ఇదే ఉన్నా జగన్ ఎదుట బయటపడే ధైర్యం ఎవరూ చేయలేరు. చేయకపోవచ్చు. ఒకరిద్దరు సమస్యలు ప్రస్తావిస్తే వారికి జగన్ ఘాటుగా సమాధానం చెప్పటంతో సమావేశంలో వాస్తవాలు చెప్పాలనుకున్న ఎమ్మెల్యేలు మౌనం పాటించారు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే జనంలో ఉంటే సరిపోదు. పనులు జరగాలి. జగన్ కూడా జనంలోకి రావాలి. తాను చేసిన పనులు చెప్పుకోగలగాలి. అభివృద్ధి ఎందుకు జరగలేదో జనాలకు వివరించాలి. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాను ఏం చేయాలో చెప్పగలగాలి. కానీ ఇవేమీ జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేరనే పిస్తుంది. అందుకే జగన్ రెండేళ్లు ముందుగా ఎమ్మెల్యేలను జనంలోకి పంపారంటున్నారు. ఇది ఏమేరకు పార్టీకి లబ్ది చేకూరుస్తుందన్నది వేచి చూడాలి.