ఆ 30 చోట్ల సిట్టింగ్ లకు సీట్లు గల్లంతేనట

ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా కన్పిస్తుంది;

Update: 2022-01-03 05:36 GMT

వైసీపీలో కుమ్ములాటలు మొదలయిపోయాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా కన్పిస్తుంది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో పాటు పార్టీ లో కూడా వర్గాలుగా ఏర్పడి ఎమ్మెల్యేకు దూరమవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో వ్యతిరేకత ఉన్న చోట అభ్యర్థులను మార్చక తప్పదన్న సంకేతాలు పార్టీ అధినాయకత్వం నుంచి వెలువడుతున్నాయి.

పార్టీ నేతలే....
దాదాపు ముప్ఫయి నుంచి నలభై నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. కారణం ఆధిపత్య పోరు. గత ఎన్నికల్లో ఆర్థికంగా ఎమ్మెల్యే గెలుపుకోసం అన్నీ పోగొట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విస్మరిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇటీవల కాలంలో బహిరంగంగానే ఎమ్మెల్యేలపై తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నారు.
రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో....
మనకు పైకి కన్పించేది పాయకరావు పేట మాత్రమే కావచ్చు. నిజమనిపించేది నందికొట్కూరు అని పించవచ్చు. కానీ అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రూపులు బయలుదేరాయి. వచ్చే ఎన్నికల్లో వీరినే అభ్యర్థులగా ఖరారు చేస్తే అసంతృప్త నేతలు పార్టీ విజయానికి పనిచేయకపోవచ్చు. అలాగని అందరినీ తప్పించేయడమూ కష్టమే.
మార్చకపోతే.....
సుమారు ముప్ఫయి నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలను మార్చకతప్పదంటున్నారు. ఉదాహరణకు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని తీసుకుందాం. ఆమెకు సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగలు మామూలుగా లేవు. ఆమెను మార్చకపోతే ఆ సీటును అధికారపార్టీ కోల్పోయినట్లే. ఇక్కడ ఎంపీ నందిగం సురేష్ బాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వర్గాలుగా విడిపోవడంతో ఆమెకు టిక్కెట్ ఇస్తే వీరిద్దరూ సహకరించరన్నది బహిరంగ రహస్యం. అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారు. ఇలా దాదాపు 30 నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకు ముప్పు తప్పేట్లు కన్పించడం లేదు.


Tags:    

Similar News