ఆ రిజల్ట్... బాబు ఆలోచనను మార్చిందా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలిసింది.

Update: 2022-03-12 04:28 GMT

ఉత్తర్ ప్రదేశ్ తో పాటు జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు రాజకీయ పార్టీలను పునరాలోచనలో పడేశాయి. ప్రధానంగా విపక్షంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు వ్యూహం మార్చుకోవాలని డిసైడ్ అయ్యారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ రెండోసారి అధికార బీజేపీ గెలవడమే ఇందుకు కారణం. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలిపోవడమే అక్కడ బీజేపీ గెలుపునకు కారణమని విశ్లేషణులు వెలువడుతున్నాయి. మాయావతి, అసదుద్దీన్ ఒవైసీ ఓట్లను చీల్చడం వల్లనే అధికారంలోకి రావాల్సిన సమాజ్ వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు....
అదే విషయంలో చంద్రబాబు ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలిసింది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలుస్తున్నా, అది ఎంత వరకూ ఉందన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. యూపీలో జరిగినట్లు ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. వీలయితే బీజేపీని కూడా కలుపుకుని వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
జగన్ ఓటు బ్యాంకు నుంచి...
జనసేన, కమ్యునిస్టులను కలుపుకుని వెళితే పెద్దగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉండదు. అదే సమయంలో బీజేపీ అండగా ఉంటే అన్ని రకాలుగా భరోసా ఉంటుంది. మరోవైపు జగన్ ఓటు బ్యాంకు చీల్చేందుకు చంద్రబాబు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ప్రధానంగా దళిత, రెడ్డి సామాజికవర్గం జగన్ కు అండగా ఉంటుంది. ఈ ఓటు బ్యాంకులో జగన్ నుంచి కనీసం పది నుంచి ఇరవై శాతం చీల్చగలిగిన సమర్థుల కోసం వెదుకుతున్నారని తెలిసింది.
సీమలో ప్రయోగం....
రాయలసీమలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. ఇక్కడ కోలుకోవడం కూడా కష్టంగానే కన్పిస్తుంది. దీంతో వైసీపీకి బలమైన నియోజకవర్గాల్లో అక్కడ బలమైన నేతలను వెతికి వారికి ఆర్థికంగా సాయం చేసి ఇండిపెండెంట్లుగా పోటీ చేయించాలన్న యోచనలో కూడా చంద్రబాబు ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో ప్రజల్లో పేరున్న, మేధావులుగా ఉన్న వారిని, రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎంపిక చేయాలని, ప్రధానంగా తనను భారీగా దెబ్బతీసిన రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రయోగం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ ను వీక్ చేసే ప్రతి మార్గం కోసం చంద్రబాబు వెతుకుతున్నారు.


Tags:    

Similar News