జగనూ నువ్వు దిగిపో సామీ... ఇక ఏ గొడవలుండవ్

సీఎం జగన్ కు ఉన్న అధికారాలపై చర్చ జరుగుతుంది. చట్టాలు చేసే అధికారం శానన వ్యవస్థకు కూడా లేదేమోనన్న సందేహం కలుగుతుంది.

Update: 2022-03-03 13:26 GMT

అవును జగన్ కు ఏం అధికారం ఉంది? చట్టం చేసే అధికారం జగన్ కు ఎక్కడ ఉంది? ఆయన ముఖ్యమంత్రిగా నామినేట్ అయ్యాడా? లేక ప్రజల చేత ఎన్నుకోబడ్డారా? అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబుకు ఉన్న అధికారం మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి జగన్ కు లేదేమో. అందుకే జగన్ అసలు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారా? ఆయన పార్టీకి 151 సీట్లు వచ్చాయా? అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. అసలు శాసనసభకు చట్టాలు చేసే అధికారం కూడా లేదా? ఏమో నాకు తెలియదు. లేదేమో. అనుభవం కలిగిన వారే చెప్పాలి.

ఆరు నెలల్లో సాధ్యమా?
హైకోర్టు తీర్పును తప్పు పట్టడం కాదు కాని, ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆదేశించడమే నవ్వు తెప్పిస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉండి నాలుగు ఏళ్లలో అమరావతిని పూర్తి చేయలేకపోయారు. మరి జగన్ మాస్టర్ ప్లాన్ ను ఆరు నెలల్లో పూర్తి చేయగలరా? అసలు సాధ్యమేనా? మాస్టర్ ప్లాన్ అంటే నవ నగరాలు నిర్మించాలి. అది చెప్పాలంటే బోలెడు ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఒక వార్తలో నాటి అమరావతిని వర్ణించలేం. అనేక నగరాలను అమరావతిలో నిర్మించాల్సి ఉంది.
నిధుల మాటేంటి?
మరి దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తుందా? అమరావతి నిర్మాణానికి 2015 అక్టోబరు 22న శంకుస్థాపన ప్రధాని నరేంద్రమోదీ చేశారు. అప్పటి నుంచి రాజధాని నిర్మాణం కొనసాగుతూనే ఉంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం రావడంతో అక్కడ నిర్మాణ పనులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అమరావతిలో శాసన రాజధానిని నిర్మిస్తామని చెప్పారు.
దిగిపోయి వేరే వారికి....
ఇప్పుడు హైకోర్టు చెప్పినట్లు ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ను అభివృద్ధి చేయగలరా? మూడు నెలల్లో రైతులకు అభివృద్థి చేసిన ఫ్లాట్లను ఇవ్వగలరా? అంటే అసాధ్యమనే అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు గాని జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి వేరే వారికి ఆ పదవి ఇస్తే ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయగలరేమో? ఒక ఛాన్స్ ఇచ్చి చూడకూడదూ. అయినా జగన్ కు ఆ అధికారం కూడా ఉందో లేదో? ప్చ్... పాపం జగన్ అధికారంలేని ముఖ్యమంత్రిగా జగన్ మరో రెండేళ్లు పరిపాలన చేయాల్సిందేనేమో.


Tags:    

Similar News