నెలకోసారి నారావారి పలుకులింతే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇది కొత్తేమీ కాదు. తాను ప్రతిపక్షంలో ఉండగా ముందస్తు ఎన్నికలను ఊహిస్తారు.

Update: 2022-03-09 08:07 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇది కొత్తేమీ కాదు. తాను ప్రతిపక్షంలో ఉండగా ముందస్తు ఎన్నికలను ఊహిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నిర్ణీత సమయం మేరకే ఎన్నికలు జరుగుతాయని చెబుతారు. క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకే ఆయన తరచూ ఈ ప్రయత్నం చేస్తుంటారు. ఆయన ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని చెబుతారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ విజయం సాధించినా జమిలీ ఎన్నికలు వస్తాయన్న ప్రచారాన్ని చంద్రబాబు స్వయంగా ఖండించారు.

తాను అధికారంలో ఉంటే....
ప్రజలు తమకు ఐదేళ్లు పరిమితితో ఎన్నుకున్నారని, ముందస్తుగా ఎన్నికలకు ఎందుకు వెళతామని చంద్రబాబు ప్రశ్నించారు. కానీ అదే లాజిక్కు మాత్రం అవతల పార్టీ నేతలకు వర్తించదేమో. చంద్రబాబు పార్టీ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత 175 నియజకవర్గాల్లో పార్టీ క్యాడర్ డీలా పడింది. మరోవైపు జగన్ ప్రభుత్వం పెట్టే కేసులు భరించలేక జెండా పట్టుకుని బయటకు రావడానికి కార్యకర్తలు భయపడే పరిస్థితికి వచ్చారు.
జమిలి ఎన్నికలంటూ...
అందుకే ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన ఏడాది నుంచే జమిలి ఎన్నికలంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఢిల్లీ నుంచి చంద్రబాబుకు ఖచ్చితమైన సమాచారం ఉందని ఆయన అనుకూల మీడియా ద్వారా ప్రజల్లోకి, పార్టీ క్యాడర్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే జమిలి ఎన్నికలు రాలేదు కదా? చంద్రబాబు ఊహించినట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్యాడర్ లో ఏమాత్రం చురుకుదనం పెరగలేదు. స్థానికసంస్థలు వైసీపీ ఊడ్చేసి వెళ్లిపోయింది.
రేపో, మాపో అంటూ...
ఇప్పుడు తాజాగా చంద్రబాబు మరోసారి ముందస్తు ఎన్నికలకు వస్తాయని చెబుతున్నారు. జగన్ మరో రెండేళ్లు వెయిట్ చేస్తే వ్యతిరేకత పెరుగుతుందని భావించి ముందుగానే ఎన్నికలకు వెళతారని చంద్రబాబు జోస్యం చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని మడతెట్టేస్తామంటున్నారు. జగన్ కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటి వరకూ పాలనపైనే దృష్టి పెట్టిన జగన్ పార్టీపైన కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఈ రెండేళ్లు కీలకం. నిజంగా జగన్ పై వ్యతిరేకత ఉంటే దానిని తొలగించుకునేందుకు ఈ రెండళ్లు ప్రయత్నిస్తారు. అందుకే పార్లమెంటు ఎన్నికలతోనే జగన్ కూడా ఎన్నికలకు వెళతారు. చంద్రబాబు మాత్రం క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు మాత్రం నెలకొసారి చంద్రబాబు ముందస్తు ఎన్నికలను తెరపైకి తెస్తారన్నది వాస్తవం.


Tags:    

Similar News