ఏపీలో కోడి గుడ్డు వెయ్యి రూపాయలు.. ప్రజలూ తస్మాత్ జాగ్రత్త

త్వరలో శ్రీలంక మాదిరి ఏపీ తయారవుతుందని ప్రజలను ఆ రెండు పత్రికలు అప్రమత్తం చేసే పనిలో పడ్డాయి

Update: 2022-04-05 07:16 GMT

పారాహుషార్.. అందరూ అప్రమత్తంగా ఉండండి.. కిలో ఉల్లిపాయలు రూ.150లు. లీటరు పెట్రోలు ధర 250లు. ఒక యాపిల్ ధర వంద రూపాయలు. ఒక కోడిగుడ్డు ధర యాభై రూపాయలు. ఇవన్నీ శ్రీలంక సంక్షోభంలో పెరిగిన రేట్లు. నిత్యవాసరాలు, అత్యావసరాలు అందక శ్రీలంక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ మనం రోజూ పేపర్లో చదువతూ, టీవీల్లో చూస్తూ శ్రీలంక ప్రజలది ఎంత నరకమో కదా? అని అనుకోక మానము. కానీ శ్రీలంక పరిస్థితులు ఇప్పుడు ఏపీకి కూడా వస్తాయట. అంటే ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ పడిపోతుందట. కోడి గుడ్డు వెయ్యి రూపాయలు పలికే అవకాశముంది.

అనుకూల మీడియా....

ఇది చెబుతున్నది ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోటి నుంచి ఏపీ మరో శ్రీలంకలా మారుతుంది అని అలా అన్నారో లేదో కాని టీడీపీ అనుకూల మీడియాలో విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. త్వరలో శ్రీలంక మాదిరి ఏపీ తయారవుతుందని ప్రజలను ఆ రెండు పత్రికలు అప్రమత్తం చేసే పనిలో పడ్డాయి. అప్పులు లెక్కకు మించి చేయడం, సంక్షేమ పథకాలు విపరీతంగా అమలు చేస్తుండటంతో త్వరలో ఏపీ శ్రీలంకలా మారుతుందన్న కథనాలు వస్తున్నాయి. మొన్ననే లోకేష్ తన తండ్రిని రాముడన్నాడు. అంటే చంద్రబాబు రాముడు. జగన్ రావణుడు. అన్న రీతిలో కథనాలు ప్రచురిస్తున్నారు. 

ప్రజలను భయపెట్టేందుకు....
పాపం.. ప్రజలను భయపెట్టడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. చంద్రబాబును సేఫ్ జోన్ లో నెట్టడానికి ఏపీని శ్రీలంకలా మార్చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఒక ఏపీ రాష్ట్రంలోనే అమలువుతున్నట్లు, అప్పులు కూడా ఒక్క ఏపీ ప్రభుత్వమే ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నట్లు లెక్కలతో మరీ చెప్పి ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. జగన్ చేతకాని పరిపాలన కారణంగా త్వరలో ఏపీ శ్రీలంకలా మారుతుందని ఈ రెండు పత్రికలు ముందే జోస్యం చెబుతున్నాయి.


మోదీతో అన్నారట.....
ఏపీలో ఇబ్బడి ముబ్బడిగా ప్రజాసంక్షేమ పథకాలను అప్పులు చేసి మరీ అమలు చేస్తున్నారని, ఇదే కొనసాగితే త్వరలో ఏపీ శ్రీలంకలా మారుతుందని కేంద్రప్రభుత్వ అధికారులు మోదీకి వివరించినట్లు ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అప్పలు చేయడం పంచిపెట్టడం తప్ప జగన్ చేస్తుందన్నదేమిటి? అని ప్రశ్నించారు. ఇక ఈనాడు అయితే నిపుణులు హెచ్చరిక అంటూ శ్రీలంక లా ఏపీ త్వరలోనే తయారవుతుందని తన అభిప్రాయంలా కాకుండా నిపుణుల హెచ్చరిక అంటూ ఈనాడు ఒక కథనం వండి వార్చింది. సో.. ఈనాడు, జ్యోతి చెప్పేశాయి. ఇక శ్రీలంకలా భారతదేశంలోని ఒకే ఒక రాష్ట్రం ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ప్రజలు తస్మాత్ జాగ్రత్త.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటెయ్యండి. లేకుంటే ఇక మీ పరిస్థితి అధోగతే అంటూ వండి వార్చిన కథనాలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. తమ కథనాలను ఐదు శాతం ప్రజలు నమ్మినా చంద్రబాబు అధికారంలోకి వస్తాడన్న ఆశ కావచ్చేమో.


Tags:    

Similar News