ఢిల్లీలో జగన్ కు పెద్ద డిమాండ్.. కారణమిదే?
రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ కీలకంగా మారనుంది. ఎన్డీఏ అభ్యర్థి పదమూడు వేల నుంచి పదిహేను వేల ఓట్ల దూరంలో ఉన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ కీలకంగా మారనుంది. ఎన్డీఏ అభ్యర్థి పదమూడు వేల నుంచి పదిహేను వేల ఓట్ల దూరంలో ఉన్నారు. అందుకే అన్ని పక్షాలను కలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. గత ఎన్నికల్లో వైసీీపీ, టీఆర్ఎస్, బిజూ జనతాదళ్ లు రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాధ్ కోవింద్ కు మద్దతిచ్చాయి. ఈసారి టీఆర్ఎస్ దూరంగా ఉంది. బిజూ జనతాదళ్ కూడా చివరి నిమిషంలో బీజేపీకి మద్దతిచ్చే అవకాశముంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో...
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పార్టీ కీలకమని చెప్పక తప్పదు. వైసీపీకి 23 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యే బలం ఉండటంతో ఆయన ఓకే అంటేనే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమవుతుంది. అందుకే ఇప్పుడు హస్తినలో వైసీపీని మరింత దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. జులై 18న ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓట్లు అతి ముఖ్యమవుతున్నాయి. వైసీపీ మద్దతు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.
మోదీ పర్యటనలో...
అయితే వచ్చే నెల 4వ తేదీన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. విశాఖ, నర్సాపురం జిల్లాల్లో పర్యటిస్తారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు జగన్ వెళతారు. ఈ సమయంలో జగన్ తో ప్రత్యేకంగా మోదీ సమావేశమవుతారని తెలిసింది. ఈలోపు ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థి కూడా నేరుగా ఏపీకి వచ్చి జగన్ ను కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్ షా కూడా జగన్ తో ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలిసింది.
విపక్షాలు సయితం...
మరోవైపు విపక్షాలు కూడా వైసీపీని తమ అభ్యర్థికి మద్దతిచ్చేలా ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నాయి. మమత బెనర్జీ నాయకత్వంలో జరుగుతున్న సమావేశంలో అభ్యర్థిని నిర్ణయిస్తారంటున్నారు. అభ్యర్థికి కాంగ్రెస్ తో సహా ఇతర విపక్షాలు అంగీకరిస్తే మమత బెనర్జీ పీకే ద్వారా జగన్ తో సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ కూడా రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక జరిగిన తర్వాత జగన్ తో ప్రత్యేకంగా మాట్లాడతారని సమాచారం. మొత్తం మీద ఢిల్లీలో వైసీీపీకి పెద్ద డిమాండ్ ఏర్పడింది.