అందరూ ఎదురు చూసేది ఇందుకోసమేనా?

Update: 2017-01-31 10:36 GMT

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. అయితే అందరి దృష్టి ఆదాయపు పన్ను పరిమితి మీదనే ఉంది. ప్రతి ఏడాది ఇది మామూలుగా జరిగే విషయమైనా ఈసారి ఎగువ మధ్యతరగతి ప్రజలు,ఉద్యోగులు, వ్యాపారులు దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని, పన్ను స్లాబు రేట్లను పెంచాలన్న డిమాండ్ సర్వత్రా విన్పిస్తోంది.

ఉద్యోగుల మొర వింటారా?

పెద్దనోట్ల రద్దు తర్వాత ఈ బడ్జెట్ పై ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అందులో ప్రధాన మైంది ఆదాయపన్ను పరిమితిని పెంచడం. ప్రత్యక్ష్య పన్నుల వ్యవస్థను కేంద్రం సరళీకరించ నుండటంతో పన్ను పరిమితిని కూడా పెంచుతారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల ఆదాయ పరిమితి ఉంది. అయితే ఇప్పుడు పరిమితిని మూడు లక్షలకు చేరుస్తారా? నాలుగు లక్షలకు పెంచుతారా? అన్నది తెలియడం లేదు. అలాగే ఆదాయపు పన్ను మినహాయింపుల్లో ఒకటైన సెక్షన్ 80 సీ పరిధిని పెంచాలన్న డిమాండ్ విన్పిస్తోంది. ఎక్కువగా ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయపు పన్ను పరిమితి పెంచాలని కోరుకుంటున్నారు. సెక్షన్ 80 సీ కింద ప్రస్తుతం లక్షన్నర రూపాయల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ మినహాయింపును రెండున్నర లక్షలకు పెంచే అవకాశముందంటున్నాయి ఢిల్లీ వర్గాలు. సెక్షన్ 80 కింద మినహాయింపులు పెంచాలని ఇప్పటికే సీఐఐ భారత ప్రభుత్వాన్ని కోరింది. మరి జైట్లీ ప్రకటన కోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

Similar News