అయితే...ఓకే...అన్న ట్రంప్

Update: 2017-02-02 10:30 GMT

అమెరికాలో ప్రవేశానికి నిషేధానికి గురైన ఏడు దేశాల పౌరులకు కొంత ఊరట లభించింది. గ్రీన్ కార్డు ఉంటే ఎవరైనా అమెరికాలోకి ప్రవేశించవచ్చని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. గ్రీన్ కార్డు ఉన్నప్పుడు ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోనవసరం లేదని వైట్ హౌస్ అధికారులు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఏడు దేశాల పౌరులను అమెరికాలోకి మూడు నెలల పాటు నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో కూడా వేల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్, ఇరాక్, సోమాలియా, సూడాన్, లిబియా, యెమన్, సిరియా దేశాల పౌరులు గ్రీన్ కార్డు ఉన్నా అనుమతించడం లేదు అమెరికా అధికారులు. వారిని ఎయిర్ పోర్ట్ వద్దనే నిలిపేస్తున్నారు. దీంతో అమెరికాలోని అన్ని ఎయిర్ పోర్ట్ ల వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగారు.

అయితే తాజా నిర్ణయంతో ఈ ఏడు దేశాల ప్రజలకు కొంత ఊరట లభించిందనే చెప్పాలి. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లను ఎలాంటి అనుమతులు అడక్కుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు చెప్పారు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఇచ్చారు ట్రంప్.

Similar News