కృపయా...ధ్యాన్ దే...

Update: 2017-01-28 09:00 GMT

ఏపీ రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించిన సర్వే పూర్తైంది. 2016-17 బడ్జెట్‌లో అమోదం పొందిన సర్వేను రాష్ట్రీయ రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ పూర్తి చేసి రైల్వే బోర్డుకు సమర్పించింది. ఫిబ్రవరి 1న యూనియన్‌ బడ్జెట్‌తో కలిపి రైల్వే బడ్జెట్‌ రానున్న నేపథ్యంలో రైల్వే శాఖ అమోద ముద్ర వేస్తే కొత్త రైలు మార్గం మంజూరయ్యే వీలుంది. 2017-18లో పనులు ప్రారంభిస్తే నాలుగేళ్లలో అమరావతి రైలు అనుసంధాన పనులు పూర్తి చేయోచ్చని ఆర్‌వీఎన్‌ఎల్‌ అంచనా వేసింది. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేందుకు మూడు మార్గాలను ప్రతిపాదించింది.

రూ.2,679 కోట్ల ఖర్చు....

ఇందుకోసం కొత్తగా 106 కిలోమీటర్ల ట్రాక్‌వేయాల్సి ఉంది. నంబూరు-అమరావతి- ఎర్రుపాలెంల మధ్య రెండు వరసల ట్రాక్‌తో కలిపితే దాదాపు 189 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు దాదాపు రూ.2679కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. నంబూరు-అమరావతి-ఎర్రుపాలెంల మధ‌్య 58కి.మీ దూరానికి 2069కోట్లతో డబుల్‌లైన్‌., అమరావతి -పెదకూరపాడు మధ్య 24.5కి.మీ దూరానికి రూ.300కోట్లతో సింగల్‌లైన్‌., సత్తెనపల్లి-నరసరావు పేట మధ్య 25.కి.మీ దూరానికి 210కోట్లతో సింగల్‌ లైన్‌ నిర్మించేందుకు సర్వే పూర్తి చేశారు. ఈ పనులు పూర్తైతే విజయవాడ- గుంటూరులతో సంబంధం లేకుండా అటు రాయలసీమ., ఇటు హైదరాబాద్-కాజీపేట-ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి నేరుగా అమరావతి చేరుకునేందుకు వీలవుతుంది.

Similar News