కేసీఆర్ దెబ్బకు కంగారులో కాంగ్రెస్

Update: 2017-02-03 04:31 GMT

కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ కు కంగారు పట్టుకుంది. కొత్త భయం పట్టుకుంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేసి కేసీఆర్ ఎక్కడ ఆ వర్గాల్లో హీరో అయిపోతారోనని బెంగ పట్టుకుంది హస్తం నేతలకు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను చట్ట రూపంలోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అయితే ఎన్నికల ముందు కావడంతో నిబంధనలను రూపొందించేంత వరకూ వెళ్లలేదు. ఇప్పటి వరకూ ఆ ఘనత తమదేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకోలేక పోయారు. ఇప్పడు కేసీఆర్ సబ్ ప్లాన్ నిధులను ఖచ్చితంగా అమలయ్యే చూసేందుకు సిద్ధపడుతున్నారు.

కేసీఆర్ పై పొగడ్తలు...

ఇటీవల కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. రెండేళ్లలో ఖర్చు చేయలేని నిధులను ఇప్పడు అమలు చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల సూచనలను సావధానంగా విన్న కేసీఆర్ ఈ బడ్జెట్ లోనే చూస్తారని వారికి హామీ కూడా ఇచ్చారు. దీంతో ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడే తనకు అభినందనలు వద్దని, సబ్ ప్లాన్ అమలయ్యాక చెప్పమని కేసీఆర్ వారికి సలహా కూడా ఇచ్చారట.

కింకర్తవ్యం?....

ఈ విషయమే కాంగ్రెస్ భయానికి కారణం. తాము రూపొందించిన చట్టాన్ని కేసీఆర్ ఎగరేసుకుపోతున్నారన్న భావన కాంగ్రెస్ లో ఉంది. కాంగ్రెస్ కు రావాల్సిన క్రెడిట్ కేసీఆర్ కొట్టేస్తే వచ్చే ఎన్నికల్లో ఈ వర్గం దూరమయ్యే ప్రమాదముందన్న ఆందోళన ఆపార్టీ నేతల్లో వ్యక్త మవుతోంది. కేసీఆర్ ను సమావేశంలో పొగిడిన కాంగ్రెస్ నేతలను తప్పుపడుతున్నారు కొందరు. చట్టాన్ని తామే తెచ్చామని అక్కడ ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ సమావేశానికి తాము హాజరుకాకుంటే సబ్ ప్లాన్ కు కాంగ్రెస్ వ్యతిరేకమన్న ప్రచారం అధికారపార్టీ చేసేది కదా? అని వెళ్లివచ్చిన నేతలు అంటున్నారు. మొత్తంమీద ఎస్సీ, ఎస్టీసబ్ ప్లాన్ కాంగ్రెస్ లో కలవరం పుట్టిస్తోంది.

Similar News