జగన్ జిల్లాలో రైతులు ఏమంటున్నారు?

Update: 2017-01-31 04:56 GMT

కడప జిల్లా తీవ్ర కరువుతో అల్లాడి పోతోంది. పనులు లేక రైతులు పస్తులుండే పరిస్థితి తలెత్తింది. జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కూడా అందక అల్లాడి పోతున్నారు. కొన్నేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు వలస బాట పట్టగా...మరికొందరు తమ ఊళ్లలోనే పనులకు వెళుతూ పొట్ట నింపుకుంటున్నారు.

పనికి రాని ఉపాధి హామీ పథకం...

కడప జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 5.60 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులిచ్చారు. ఇందులో 12 లక్షల మంది కూలీలుగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. గత ఏడాది మూడు లక్షల మందికే జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు దక్కాయి. ఈ ఏడాది కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఇప్పటి వరకూ కేవలం ఈ పథకం కింద 18 వేల మందికే పనులు ఇచ్చారు అధికారులు. దీంతో ఇటు పనులు దక్కక, అటు పంటలు పండగక ఏమి చేయలేని దిక్కు తోచని స్థితిలో ఉన్నారు అన్నదాతలు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నియోజకవర్గంలోని కాశినాయన, దూలంవారిపల్లె, తెల్లపాడు, పుల్లారెడ్డి పల్లె వంటి గ్రామాల్లో వలసలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అాలాగే రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లి, కమలాపురం, వీరపునాయునిపల్లె, వేముల, వేంపల్లె గ్రామాల్లో తమకు ఉపాధి కల్పించాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. రాయచోటి, కమలాపురం, పులివెందుల్లో వేసిన వేరుశెనగ పంటకు పెట్టుబడులు కూడా రాకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికైనా పాలకులు కడప జిల్లాలో కరవు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద తమకు పనులు కల్పించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

Similar News