తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలివే...

Update: 2017-02-02 16:23 GMT

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బడ్జెట్ సమావేశాలతో పాటు మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం మల్కాపూర్ లో దేవాదుల ఆయకట్టు స్థిరీకరణకు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కంతన పల్లి బ్యారేజీ కు బదులుగా తుపాకుల గూడెం వద్ద గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రద్దు చేయాలని నిశ్చయించింది. అనేక శాఖల్లో ఉన్న అదనపు ఉద్యోగులను పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న శాఖలకు బదిలీ చేయాలని భావించింది. కరీంనగర్ ఎల్ఎండి వద్ద ఫిషరీస్ కళాశాలను ఏర్పాటు చేయటానికి ఆమోద ముద్ర వేసింది.

మరిన్ని ఎత్తిపోతలు....

అలాగే భక్త రామదాసు ప్రాజెక్టు తరహాలోనే తక్షణం నీరు అందించగల ఎత్తిపోతల పథకాలకు అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించింది. దీనిపై మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇవ్వాలి. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు భవనాలను ఏడాదిలోగా నిర్మించాలని నిర్ణయించింది.

చట్టంలో మార్పులు తెచ్చేలా...

అలాగే జైళ్లలో సంస్కరణలు తెచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. హోంమంత్రి నాయని నరసింహారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీలో కేటీఆర్, ఈటెల రాజేందర్, ఇంద్రకిరణ్ రెడ్డిలు ఉన్నారు. యాసిడ్ దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలను రూపొందిచాలని భావించింది. గతంలో ఉన్న చట్టాలను మార్పు చేస్తూ యాసిడ్ దాడులకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించేలా చట్టాలను రూపొందిచాలని అభిప్రాయపడింది. జరిమానా డబ్బును బాధితులకు అందిచాలే చట్టాలను రూపకల్పన చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Similar News