దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు: చంద్రబాబు

Update: 2017-02-05 09:33 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీద చంద్ర బాబు విమర్శలు గుప్పించారు. ఒక వ్యక్తి దేశాన్ని ఎలా నాశనం చేస్తారనేది ట్రంప్‌ చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా మనవాళ్లు పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో ఉపాధ్యాయుల అధికారిక సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమెరికా గందరగోళంగా ఉందని, అతలాకుతలం అయిపోతుందని వ్యాఖ్యానించారు.ఈ సదస్సులో సీఎం వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో పరోక్షంగా టీచర్ల ఓట్లను అభ్యర్థించారు. ఉపాధ్యాయులకు రెండు ఓట్లు ఉన్నాయి.. మీ సహకారం నాకు కావాలి' అని వ్యాఖ్యానించారు. 2004లో నాకు వ్యతిరేకంగా పని చేశారని., ఎన్ని సమస్యలు ఉన్నా ఉపాధ్యాయులకు ఏ లోటు చేయలేదన్నారు. టీచర్ అనేవాళ్లు ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. 2004లో నేను ఓడిపోతానని ఎవరూ ఊహించలేదన్నారు. మీలో కొందరు తనకు వ్యతిరేకంగా పని చేశారని చెప్పారు.

యువత మన సొంతం

మంచి నాయకుడు ఉంటే దేశం కానీ, రాష్ట్రం కానీ మంచి అభివృద్ధి చెందుతుందన్నారు. లేకపోతే దేశం, రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఉంటుందన్నారు. భారత దేశంలో ఎక్కడా లేనటువంటి యువత మన సొంతమన్నారు.అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతుందని, ఒకప్పుడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన తాను ఇప్పుడు పిల్లల్ని కనండని చెబుతున్నానని చంద్రబాబు అన్నారు.ప్రపంచంలో ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా అందించే శక్తి సామర్థ్యం ఒక్క భారత్‌కే ఉందని, వేరే దేశానికి లేదన్నారు.

కష్టాలు శాశ్వతం కాదు

ఏపీలో అన్ని వనరులు ఉన్నా చాలా ఇబ్బంది పడ్డామని, రూ.16వేల కోట్ల అప్పుతో రాష్ట్రం వచ్చిందని, అయితే కష్టాలు శాశ్వతం కాదని, కష్టాలను అధిగమించి ముందుకు వెళతామనే నమ్మకం తనకు ఉందన్నారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి వంటిదని చంద్రబాబు అన్నారు. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని పేర్కొన్నారు. పోలవరం పూర్తైతే నీటి సమస్య తీరుతుందని, దాని కోసం నిరంతరం కష్టపడుతున్నామని సీఎం వివరించారు.

Similar News