పోలీసు బాస్ పైనే సీఐ ఫైర్

Update: 2017-01-30 09:40 GMT

సాధారణంగా పోలీస్‌ శాఖలో బాస్‌లు ఏం చేసినా కింది స్థాయి సిబ్బంది పల్లెత్తి ప్రశ్నించరు.....యూనిఫాం సర్వీస్‌ కావడమో., క్రమశిక్షణగా భావిస్తారో., లేకుంటే తాము కూడా తమ కింది వారితో అలాగే ప్రవర్తిస్తామనే భావనో తెలియదు కాని ఎస్సైల నుంచి డీజీపీ స్థాయి వరకు తమ కింది వాళ్లను తక్కువ శ్రేణి పౌరులుగానే పరిగణిస్తుంటారు. అందుకు భిన్నమైన సంఘటనలు అడపదడప జరిగినా అవి వెలుగు చూడకుండా తొక్కిపెట్టేస్తుంటారు. అయితే కమిషనర్‌ స్థాయి అధికారి తనను వేధిస్తున్నాడని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆరోపణలకు దిగారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శివకుమార్‌ తనను వేధిస్తున్నారని హుస్నాబాద్‌ సీఐ దాసరి భూమయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి డీజీపీని నిలదీసినందుకు ఇప్పటికి తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 20 రోజులుగా తాను సిక్‌ లీవ్‌లో ఉన్నానని విధుల్లో చేరేందుకు వస్తుండగా ‘తనకు బదిలీ అయింది.., స్టేషన్‌కు వెళ్లద్దు. జీపు వాడొద్దని ఏసీపీ ద్వారా కమిషనర్‌ ఒత్తిడి చేశారని సిఐ ఆరోపించారు.తనకు బదిలీ ఆర్డర్‌ రాలేదని., ప్రొసీజర్‌ ప్రకారం, కొత్తగా వచ్చే సీఐకి ఛార్జి అప్పగించిపోతానని చెప్పినా నిరాకరించారని ,స్టేషన్లో ఉండొద్దని మానసిక ఒత్తిడికి గురి చేశారని ఆరోపించారు. సీపీ శివకుమార్‌ తనపై కక్ష పెట్టుకోవడానికి తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఘటన కారణమని సిఐ వివరించారు.

సీపీ భార్య ప్రభుత్వ వాహనంలో....

‘‘అప్పట్లో హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో జై తెలంగాణ అని నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను యూనిఫాంలో లేని పోలీసులు కొట్టారని., అప్పుడు పోలీస్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న తాను డీజీపీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో.., అప్పుడు కరీంనగర్‌ ఎస్పీగా ఉన్న శివకుమార్‌ రెండు ఛార్జి మెమోలు ఇచ్చి సీఐడీకి బదిలీ చేయించారని సిఐ భూమయ్య చెప్పారు. పోలీసు అమరుల భవన నిర్మాణ అవకతవకలపై ఆర్‌టీఐ కింద లెక్కలు అడిగడంతో తనపై సీపీ కక్ష పెంచుకున్నాడని చెప్పారు. సిఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు చొరవతో తనకు మళ్లీ హుస్నాబాద్‌ సీఐగా బదిలీ అయిందని, విధుల్లో ఉండగానే ఇప్పుడు జీపు వాడొద్దు. కుర్చీలో కూర్చోవద్దు. స్టేషన్‌కు వెళ్లద్దు’ అంటూ ఆంక్షలు విధించారని చెప్పారు. సీపీ శివకుమార్‌ భార్య ప్రభుత్వానికి చెందిన టవెరాను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నారని దానికి డ్రైవర్‌గా కోహెడ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ను వినియోగించుకున్నారని చెప్పారు. ప్రస్తుతం బెజ్జంకి కానిస్టేబుల్‌ సీపీ భార్య వాడుతున్న టవేరా డ్రైవర్‌గా పని చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారు ప్రభుత్వ వాహనం వాడుకుంటున్నారని., సీనియర్‌ పోలీస్‌ ఉద్యోగిగా డ్యూటీలో జీపు వాడటం ఎలా తప్పు అవుతుందని ఆయన ప్రశ్నించారు. సిఐ ఆరోపణల్ని సిద్దిపేట సీపీ తోసిపుచ్చినా మొత్తం వ్యవహారం మీద తెలంగాణ సర్కారు విచారణకు ఆదేశించింది.

Similar News