ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు : జగన్

Update: 2017-01-26 08:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసనలను తెలుపుతామన్న యువకులను ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారన్న జగన్ తన స్వప్రయోజనాల కోసమే హోదా ఉద్యమాన్ని అడ్డుకుంటున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏపీకి ఒనగూరే ప్రయోజనాలేంటో చెప్పాలని చంద్రబాబును జగన్ నిలదీశారు. పార్లమెంటు లో హోదాపై ఇచ్చిన హామీకే దిక్కులేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కోరుతూ పాదయాత్ర చేస్తామంటే అనుమతివ్వరని, శాంతియుతంగా హోదాకోసం నిరసనలు చేస్తామన్న ఒప్పకోరని ఇదెక్కడి న్యాయమని జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. కొవ్వొత్తుల ర్యాలీ చేస్తే విధ్వంసం జరుగుతుందని ప్రభుత్వమే ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. విశాఖ నగరంపై తామొక్కరికే ప్రేమ ఉన్నట్లు నటించడం మానుకోవాలని జగన్ సూచించారు. కాగా ఈరోజు సాయంత్రం విశాఖలో జరిగే కొవ్వుత్తుల ర్యాలీలో జగన్ పాల్గొనాల్సి ఉంది. విశాఖలో పరిస్థితిపై పార్టీ నేతలను అడిగి జగన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

Similar News