మనసు మార్చుకున్న ములాయం

Update: 2017-02-02 09:00 GMT

ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ లకు సర్వే లు కొన్ని అనుకూలంగా రావడంతో పెద్దాయన ములాయం ఆలోచనలో పడ్డట్లుంది. నిన్నటి వరకూ కాంగ్రెస్, ఎస్పీ తరుపున ప్రచారం చేయనని.. చేయబోనని భీష్మించుకు కూర్చున్న ములాయం మనసు మార్చుకున్నారు. అఖిలేష్ నా కుమారుడే కదా? బయట వ్యక్తి కాదు కదా? అని మీడియా మిత్రులనే ఎదురు ప్రశ్నించారు. తాను సమాజ్ వాదీ, కాంగ్రెస్ కూటమిని బలపరుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, ఎస్సీ కూటమి విజయం సాధిస్తుందని కూడా నేతాజీ జోస్యం చెప్పేశారు.

సన్నిహితుల సలహా మేరకే....

నిన్నమొన్నటి వరకూ అఖిలేష్ పై నిప్పులు చెరిగిన ములాయం మనసు మార్చుకోవడానికి అనేక కారణాలు చెబుతున్నారు. అఖిలేష్ మ్యానిఫేస్టో విడుదల చేస్తున్నప్పుడు కూడా ములాయం రాలేదు. అయితే కుటుంబ సభ్యుల వత్తిడితో పాటుగా సన్నిహితులు, మిత్రులు కూడా అఖిలేష్ ను దూరం చేసుకోవద్దని సలహా ఇచ్చారట. యూపీని అఖిలేష్ కు వదిలేయడమే మంచిదని మరికొందరు తెగేసి చెప్పారట. దీంతో ఆయన మాట మార్చారు. తాను కాంగ్రెస్ తరుపున కూడా ప్రచారం చేస్తానని చెప్పారు. దీంతో సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం ముగిసినట్టే నని భావిస్తున్నారు.

Similar News