రెండు గంటలుగా ఎయిర్ పోర్టులోనే జగన్

Update: 2017-01-26 12:59 GMT

విశాఖ ఆర్కే బీచ్ లో జరగాల్సిన ఆందోళన ఎయిర్ పోర్టుకు మారింది. బీచ్ రోడ్డును పోలీసులు దిగ్భంధం చేయడంతో వైసీపీ కార్యకర్తలు తమ నేత జగన్ రాక కోసం ఎయిర్ పోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటల నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే జగన్ ను పోలీసులు నిర్భందించారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా జగన్ ను పోలీసులు అడ్డుకోవడంతో తొలుత రన్ వే పై బైఠాయించిన ఆయన విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతుందని భావించి విఐపీ లాంజ్ లో బైఠాయించారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. ప్యాసెంజర్ లాగా వచ్చిన తనను ఎయిర్ పోర్ట్ బయటకు ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. రెండేళ్లలో తాను ముఖ్యమంత్రి అవుతానని అప్పుడు అందర్నీ గుర్తుకు పెట్టుకుంటానని జగన్ ఈ సందర్భంగా పోలీసులను హెచ్చరించారు. యూనిఫాంలో లేని వ్యక్తిని చూసి ఇతనెవరు? పోలీసా? లేక బయట వ్యక్యా? ఐడీ కార్డు ఏదీ? అంటూ జగన్ నిలదీశారు. జగన్ పోలీసులపై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

అయితే వీఐపీ లాంజ్ లో బైఠాయించిన జగన్ తో చర్చించేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ వచ్చి చర్చలు జరుపుతున్నారు. జగన్ తిరిగి ఎయిర్ పోర్టు నుంచే హైదరాబాద్ కు పంపే ఏర్పాట్లు పోలీసులు చేస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ బయట వైసీపీ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. జగన్ ను ఎయిర్ పోర్టు నుంచి బయటకు పంపాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద విశాఖ ఎయిర్ పోర్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయితే పోలీసులు బలవంతంగా జగన్ ను హైదరాబాద్ పంపించివేశారు. హైదరాబాద్ ఫ్లైట్ లో ఎక్కించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జగన్ ను ఎయిర్ పోర్టులోనే ఉంచి అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరిగి పంపించారు.

Similar News