రైతులకు సారీ చెప్పిన సీఎం

Update: 2017-01-24 03:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి క్షమాపణలు చెప్పారు. అదీ రైతుల కోసం. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో జరిగిన జాప్యానికి తాను రైతులకు క్షమాపణలు చెబుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. వంశధార ప్రాజెక్టు కోసం దాదాపు 29 గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతున్నారు. వారికి సుమారు 480 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మంత్రివర్గ సమావేశంలోనూ ఆమోదించింది. అయితే జిల్లా అధికారులు నష్టపరిహారం చెల్లించలేదు.

వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండానే కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. దీంతో 29 గ్రామాల ప్రజలు ఏకమై నిరసన తెలియజేశారు. కాంట్రాక్టు సంస్థకు చెందిన భారీ వాహనాలకు నిప్పుపెట్టారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు వంశధార ప్రాజెక్టు వద్ద జరిగిన ఘటన గురించి ఆరా తీశారు. నష్టపరిహారం చెల్లించనందునే రైతులు రోడ్డెక్కారని తెలుసుకున్నారు. దీనికి సీఎం చంద్రబాబు రైతులను క్షమాపణ కోరారు. నష్టపరిహారం చెల్లించడంలో జిల్లాయంత్రాంగం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు చాలా బాధ కల్గించిందని, చెల్లింపులో జాప్యానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. మంగళవారం నుంచే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Similar News