విభజన సమస్యలపై గవర్నర్ ఏం చేయనున్నారో తెలుసా?

Update: 2017-01-30 07:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి రెండున్నరేళ్లవుతున్నా ఉమ్మడి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. రెండు రాష్ట్రాలూ ఎవరి వాదనలు వారు చేస్తుండటంతో ప్రధానంగా 9,10 షెడ్యూల్ లో పేర్కొన్న అంశాలపై పరిష్కారం లభించలేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దీనిపై దృష్టి పెట్టారు. రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చించాలని నిర్ణయానికి వచ్చారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి హైదరాబాద్ రాజభవన్ లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆయా శాఖల మంత్రులు పాల్గొనే అవకాశముందని రాజ్ భవన్ వర్గాలు తెలియజేశాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ తెలియజేయడంతో మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు పాల్గొంటారని సమాచారం రాజ్ భవన్ కు అందింది. తెలంగాణ నుంచి కూడా హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి పాల్గొనే అవకాశాలున్నాయని చెబుతారు. వీరిపేర్లు ఇంకా ఖరారు కాలేదు. మొత్తం మీద రెండు రాష్ట్రాల ఉమ్మడి సమస్య పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ నడుంబిగించారు. ఇప్పటికైనా పేరుకు పోయిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.

Similar News