T20 World Cup : ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చేదెవరు?... గ్రౌండ్‌లో లేకపోయినా..మనసులో నుంచి తొలగించలేరుగా?
టీ20 వరల్డ్ కప్ తో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు
పాత నీరు వెళ్లే కొద్దీ కొత్త నీరు వచ్చి చేరుతుంది. అది ఎందులోనైనా సహజం. కానీ ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం అవసరమవుతుంది. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ తో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో క్రికెట్ ఫ్యాన్స్ కొంత దిగులు పడ్డారు. ఇక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో వారిని చూడలేం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో ఇక వారిని అంతర్జాతీయ మ్యాచ్ లలో చూడలేమని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ముగ్గురు కీలకమైన ఆటగాళ్లు కావడంతో పాటు క్లిష్ట సమయంలో జట్టును ఆదుకునే ప్లేయర్లుగా అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు.
రికార్డుల రారాజుగా...
రోహిత్ శర్మ కెప్టెన్సీ అంటే అదో ధైర్యం.. కొంత అసహనంగా గ్రౌండ్ లో కనిపించినా జట్టును విజయపథాన అనేక సార్లు నడిపించారు. రోహిత్ శర్మ మారుపేరే హిట్ మ్యాన్. ఓపెనర్ గా దిగి జట్టుకు అనేక సార్లు అత్యధిక స్కోర్లు అందించిన ఆటగాడు రోహిత్ శర్మ. రికార్డుల కోసం ఏనాడూ చూడని రోహిత్ అనేక సార్లు 49 పరుగుల వద్ద, 98 పరుగుల వద్ద అవుటయ్యాడంటే జట్టు గెలవడంపై అతనికి ఉన్న అంకిత భావాన్ని వేరే చెప్పాల్సిన పనిలేదు. అలా ఎన్నోసార్లు చేజేతులా హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేజార్చుకున్నాడు. మొత్తం ఐదు సెంచరీలు ఈ ఫార్మాట్ లో రోహిత్ చేశాడు. అత్యధికంగా 205 సిక్సర్లు బాదాడు. మొత్తం 4,231పరుగులు చేసిన రోహిత్ శర్మ లేకుండా టీ 20ని భారత్ ఆడుతుంటే చూడటం కొన్నాళ్ల పాటు కష్టంగానే ఉంటుంది.
ప్రత్యర్థులకు దడ...
విరాట్ కోహ్లి గురించి చెప్పాల్సిన పనలేదు. ప్రత్యర్థులకు దడపుట్టించడంతో పాటు అనేక సార్లు జట్టుకు అద్భుతమైన విజయాలను అందించాడు. కొంతనెమ్మదిగా ఆడతాడన్న విమర్శలున్నప్పటికీ అదే సమయంలో కోహ్లి ఆడిన ఆటతోనే గెలుపు సాధ్యమయిందన్న విషయాన్ని కూడా ఎవరూ విస్మరించలేం. ఎందుకంటే కోహ్లిని అవుట్ చేస్తే చాలు అని ప్రత్యర్థులందరూ భావిస్తారు. కోహ్లి అవుట్ అయితే చాలు.. మనం సగం విజయం సాధించినట్లేనని ప్రత్యర్థి జట్లు నమ్ముతాయి. అందుకే వెరీ వెరీ స్పెషల్.. విరాట్ కోహ్లి. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అందులో విరాట్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వీరంతా ఇక విరాట్ ను టీ20 మ్యాచ్ లలో చూడలేమని ఆవేదన చెందడం సబబేనని చెప్పాలి.
ఆల్ రౌండర్ గా...
మరో కీలక ఆటగాడు రవీంద్ర జడేజా. జడేజా ఆల్‌రౌండర్. ఇటు బంతితోనూ, అటు బ్యాట్ తోనూ మైదానంలో వీరవిహారం చేస్తాడు. ఇప్పటి వరకూ 74 టీ 20 మ్యాచ్ లు ఆడిన జడేజా చేసింది 514పరుగులేఅయినా అవేకీలకం. మొత్తం 54 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో ఏ మాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేసే సత్తా జడేజాకు ఉంది. అలాగే కీలక సమయంలో వికెట్లు అందిపుచ్చుకుని భారత్ కు విజయాలను అందించిన హిస్టరీని కూడా ఎవరూ తుడిచిపెట్టలేరు. ఇలా ముగ్గురు కీలక ఆటగాళ్లు ఒకే మ్యాచ్ తో తమ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ కొంత ఆందోళనకు గురవుతున్నారు. వీరు ముగ్గురు లేకుండా టీం ఇండియా జట్టును ఊహించుకోవడం కొంచెం కష్టమే .. అయినా కొత్త తరం కూడా వీరిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని భారత్ కు టీ 20 మ్యాచ్ లలో మరిన్ని విజయాలను ఆస్వాదించాలని కోరుకుందాం. అంతకు మించి మనం చేయగలిగేదేముంది?