T20 World Cup 2024 : సమఉజ్జీల మధ్య పోరు.. ఆద్యంతం టెన్సన్ తప్పేట్లు లేదుగా?

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్ నేడు జరగనుంది. భారత్ ఫైనల్స్ లో నేడు సౌతాఫ్రికాతో తలపడుతుంది.

Update: 2024-06-29 04:23 GMT

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్ నేడు జరగనుంది. భారత్ ఫైనల్స్ లో నేడు సౌతాఫ్రికాతో తలపడుతుంది. బలబలాలను చూస్తే రెండు జట్లు సమఉజ్జీలుగానే ఉన్నాయి.ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. గెలుపు అంచనాలు కూడా అందడం కష్టమే. ఎవరి అంచనాలకు అందని జట్లు ఈసారి ఫైనల్స్ కు చేరుకున్నాయి. అందుకే ఏ జట్టుకు విజయావకాశాలన్నాయన్నది ముందుగానే చెప్పడం క్రికెట్ పండితులకు కూడా కష‌్టంగా మారింది. ఎందుకంటే భారత్, సౌతాఫ్రికాలు రెండు వరస విజయాలతో ఫైనల్స్ లోకి దూసుకు వచ్చాయి. రెండు జట్లు పోరాడి, ఓడకుండా ఆఖరు పోరుకు సిద్ధం కావడంతో గెలుపోటములు అంచనా వేయడం అసాధ్యమేనని చెప్పక తప్పదు.

గణాంకాలు చూస్తే....
అయితే భారత్ ఇప్పటికే ఒకసారి టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకోగా, దక్షిణాఫ్రికా మాత్రం తొలిసారి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. భారత్, దక్షిణాఫ్రికాలు మేటి జట్లను ఓడించి ఈ దశకు చేరుకున్నాయి. టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. రెండు జట్ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే టీ 20లలో ఇప్పటి వరకూ భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇరవై ఆరు సార్లు తలపడ్డాయి. అయితే అందులో 14 సార్లు ఇండియా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 11మ్యాచ్ లలో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక టీ 20 వరల్డ్ కప్ లో ఆరుసార్లు తలపడగా, భారత్ నాలుగు సార్లు, దక్షిణాఫ్రికా రెండుసార్లు విజయం సాధించింది. అయితే ఈ గణాంకాలు ఫైనల్స్ లో లెక్క వేయడానికి పనికి వచ్చేవి కావు. ఎందుకంటే మైదానంలో ఎవరిది పైచేయి అవుతుందో వారికే కప్పు సొంతమవుతుంది.
భారత్ పటిష్టంగానే...
భారత్ పరంగా బ్యాటింగ్, బౌలింగ్ ఫార్మాట్లలో బలంగా కనిపిస్తుంది. ఒక్క విరాట్ కోహ్లి ఫామ్ లోకి వస్తే చాలు.. ఇక కుమ్ముడు గ్యారంటీ. రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. సూర్యకుమార్ నిలబడితే చాలు స్కోరు బోర్డు పరుగులు పెడుతుంది. రిషబ్ పంత్ కొంత ఫెయిలయినా నిలకడ కలిగిన ఆటగాడుగా పేరుంది. హార్ధిక్ పాండ్యా ఆల్ రౌండర్ గా తన పెర్‌ఫార్మెన్స్ చూపుతున్నారు. అర్హదీప్ సింగ్, బుమ్రా, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు వికెట్లు సరైన సమయంలో తీయడం వల్లనే భారత్ కు వరస విజయాలు సాధించగలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. బౌలర్లు అనేక మ్యాచ్ లను గెలిపించి ఫైనల్స్ కు భారత్ ను చేర్చారు. ఇది అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. అయితే ఫైనల్స్ ఫీవర్ కొంత వరకూ ఉంటుంది. ఒత్తిడిలో మనోళ్లు ఎంత మేర విజయం సాధిస్తారన్నది చూడాల్సి ఉంది.
సౌతాఫ్రికాను తక్కువగా...
దక్షిణాఫ్రికాను తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. డీకాక్ కుదురుకుంటే కుమ్మేస్తాడు. మార్‌క్రమ్, క్లాసెన్, హెండ్రిక్స్, స్టబ్స్, మిల్లర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. వీరంతా ఐపీఎల్ లో ఆడి భారత్ బౌలింగ్ కు అలవాటు పడిన వారే.ఇక బౌలర్లలోనూ నోకియా, రబాడ, షంసీ వంటి వారు క్రమం తప్పకుండా వికెట్లు తీసుకుంటూ జట్టు విజయంలో కీలక భూమిక పోషిస్తున్నారు. దీంతో చివరి క్షణం వరకూ విజేత ఎవరో తేల్చేది చెప్పడం కష్టమేనని అంటున్నారు. అయితే వర్షం పడినా ఒకరోజు రిజర్వ్‌ డే గా ఉండటంతో ఇబ్బంది లేదు. వాతావరణ శాఖ మాత్రం 70 శాతం వర్షం పడే అవకాశాలున్నాయని చెబుతుంది. మ్యాచ్ రద్దయితే ఇరుజట్లను విజేతగా ప్రకటించనునున్నారు. మ్యాచ్ జరగాలి. విజేతఎవరో తేలాలని మాత్రం ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటాడు.


Tags:    

Similar News