T20 World Cup : ఈ వరల్డ్ కప్ .. కప్పు మాత్రమే కాదు.. కసి తీర్చుకునేలా చేసింది.. నోళ్లు మూయించింది
ఈ టీ 20 వరల్డ్ కప్ మనకు అనేక స్ఫూర్తిదాయకమైన విజయాన్ని అందించింది
ఈ టీ 20 వరల్డ్ కప్ మనకు అనేక స్ఫూర్తిదాయకమైన విజయాన్ని అందించింది. నాలుగేళ్ల పడిన కష్టానికి పడిన ప్రతిఫలమే ఇది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అందరూ చెమటోడ్చారు. నాలుగేళ్ల నుంచి నిద్రాహారాలు మాని.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నా కూడా ఆటపైనే ఫోకస్ పెట్టారు. ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ వరల్డ్ కప్ ను కొట్టాలన్న కసితో ఉన్నారు. చేతికి వచ్చిన రెండు వరల్డ్ కప్ లు దూరమయ్యాయనే బాధ వారిలో అనుక్షణం వెంటాడుతూనే ఉండి ఉంటుంది. ఫైనల్స్ కు వెళ్లి మరీ ఓటమి పాలవ్వడమంటే అంతకంటే నిరాశ మరెక్కడా ఉండదు. అందుకే అందరూ కూడబలుక్కుని ఒక్కటయ్యారు. ఐక్యంగా మైదానంలోకి దిగారు. సత్తా చాటారు మనోళ్లు.
మేటిజట్లను...
అయితే ఈ టీ20 వరల్డ్ కప్ లో రెండు ప్రపంచ మేటి జట్లను మట్టి కరిపించగలిగాం. అదీ మనల్ని ఓడించిన కసి ఊరికే పోలేదు. కడుపులో దాచుకుని మరీ సమయం వచ్చినప్పుడు దానిని తీర్చుకున్నారు. క్రీడలో దానిని పగ.. ప్రతీకారం అనకపోయినా.. రివెంజ్ అనేది మాత్రం తీర్చుకోవాల్సిందే. బదులుకు బదులు ఇచ్చుకోవాల్సిందే. ఎందుకంటే చేతికి అందిన కప్పును.. ఎగరేసుకు పోయి ఒకరు... సెమీ ఫైనల్స్ లోనే మనల్ని ఓడించి ఆటపట్టించిన మరో జట్టు. కానీ ఆ రెండు జట్లకూ మౌనంగానే మనోళ్లు సమాధానమివ్వాలనుకున్నారు. టైం మనది కాదని ఊరుకున్నారు. మన సమయం మనకు వస్తుందని భావించారు. ఆరోజు రానే వచ్చింది. అంతే కసి తీర్చుకున్నారు. కుమ్మేశారు. ఇక మాతో పెట్టుకుంటే అంతేనని వార్నింగ్ ఇచ్చారు. తమకు ఎదురేలేదని వారికి దీటుగా బదులిచ్చారు.
రెండు జట్లపై గెలిచి...
2022 టీ 20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ కు భారత్ చేరింది. ఆ మ్యాచ్ ఇంగ్లండ్ తో జరుగుతుంది. అయితే ఆ మ్యాచ్ ను ఇంగ్లండ్ ను చివరి నిమిషంలో చేజిక్కించుకుంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా గెలిచిన తర్వాత ఎంత గేలిచేశారు? వారికి సరైన సమాధానం ఈ టీ 20 వరల్డ్ కప్ లో అదే సెమీ ఫైనల్స్ లో సరైన జవాబిచ్చాం. ఇంగ్లండ్ ను ఇంటికి పంపించి ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. ఇది కదా రివెంజ్ అంటే అని ఇంగ్లండ్ కు బదులిచ్చారు. అలాగే వన్డే వరల్డ్ కప్ మనదే అనుకున్నాం. అన్ని మ్యాచ్ లను వరసగా గెలుస్తూ గత ఏడాది ఫైనల్స్ కు చేరుకున్నాం. కానీ ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. కానీ ఈసారి మనకు టైం వచ్చింది. సూపర్ 8 లోనే దానిని మట్టి కరిపించి విశ్వవిజేతలు మీరు కాదురా భాయ్.. మేమంటూ సరైన సమాధానం ఇచ్చి మరీ మనోళ్లుచెప్పడం చూస్తే ఈ టీ20 వరల్డ్ కప్ లో రెండు దేశాలపై పాత పగకు ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లయింది.