ఏపీలో మొదలైన సీప్లేన్ సర్వీసులు
ఆంధ్రప్రదేశ్ లో సీ ప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి
ఆంధ్రప్రదేశ్ లో సీ ప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, అధికారులతో కలిసి సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లారు. రాబోయే రోజుల్లో రెండు, మూడు విమానాలు వచ్చే అవకాశం ఉందని, పచ్చదనం, జలాల మధ్య శ్రీశైలంలో సీ ప్లేన్ చాలా అందంగా ఉందని అన్నారు. దీన్ని భారత్ లో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి నంద్యాల జిల్లా శ్రీశైలం వరకు సీప్లేన్ డెమో ఫ్లైట్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. విజయవాడలోని కృష్ణానదిపై పున్నమి ఘాట్‌లో డెమో ఫ్లైట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదొక కొత్త ప్రయోగమని అన్నారు. దేశంలో కొత్తగా ఏదైనా జరిగితే అమరావతిలో జరగాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు చంద్రబాబు. సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముందుకు వచ్చారని తెలిపారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని, సీప్లేన్ ఆపరేషన్లు రాష్ట్ర భవిష్యత్తునే కాకుండా భారతదేశాన్ని కూడా మారుస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సీప్లేన్ ఆపరేషన్‌లను ముందుగా ప్రయత్నించినప్పటికీ, కోవిడ్, ఇతర కారణాల వల్ల అవి టేకాఫ్ కాలేదని అన్నారు.