Heavy Rain Alert : మూడు రోజులు ఏపీకి భారీ వర్ష సూచన... హై అలెర్ట్
నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ కూడా తెలిపారు. రానున్న రెండు రోజుల్లో పశ్చిమ దిశగా ఈ అల్పపీడనం పయనించి తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
వాగులు, వంకలు దాటకుండా...
దీంతో పాటు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూప ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ ప్రభావం కారణంగా భారీ వర్షాలు పడతాయని, వాగులు, వంకలు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాముందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని...
పిడుగులు పడే అవకాశమున్నందున పొలాల్లో పశువుల కాపర్లు చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఇక వరి కోతలు, ఇతర వ్యవసాయ పనులు ఉన్న రైతాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశమున్నందున అన్ని ప్రాంతాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరింది. ఇందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని సూచించింది. మత్స్యకారులు కూడా చేపలవేటకు వెళ్లకపోవడమే మంచిదని వాతావరణ శాఖ చెప్పడంతో మరోసారి ఫిషర్‌మెన్ కమ్యునిటీ ఆందోళనకు గురవుతుంది.