Chandrababu : సీబీఎన్ ఓపికకు మాత్రం హ్యాటాఫ్ చెప్పాల్సిందే.. ఇటు రాష్ట్రం.. అటు పార్టీని ఒంటిచేత్తో?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్వాస.. ఊపిరి అంతా రాజకీయమే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నప్పటికీ క్షణం విశ్రాంతి తీసుకోరు

Update: 2024-11-06 06:10 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్వాస.. ఊపిరి అంతా రాజకీయమే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నప్పటికీ క్షణం విశ్రాంతి తీసుకోరు. ఎక్కువ సమయం రాజకీయాలకే వెచ్చిస్తారు. రాజకీయాల్లోకి ఆయన అడుగు పెట్టిన నాటి నుంచి కుటుంబానికంటే ఆయన పాలిటిక్స్ కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వయసులో ఉన్నప్పుడు సరే.. ఇప్పుడు ఏడు పదుల వయసులోనూ అదే స్పీడ్.. అదే రేంజ్ లో రాజకీయాలను ఒక ఆటాడేసుకుంటున్నారు. నిజంగా ఆయన ఓపికకు రాజకీయ నేతలు సయితం విస్మయం చెందుతున్నారు. దేశంలోనే ఏ రాజకీయ నాయకుడికి లేనంత పట్టుదల, ఓపిక, సహనం, చాతుర్యం ఒక్క చంద్రబాబులోనే కనిపిస్తుంది.

పాలనపై పూర్తిగా...
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన ఎక్కువ సమయం పాలనపై దృష్టి పెడతారని భావించి చాలా మంది తప్పులో కాలేశారు. అంతే సమయాన్ని ఆయన పార్టీకి వెచ్చిస్తున్నారు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాక్షాత్తూ మంత్రిని పార్టీ సభ్యత్వాలపై చంద్రబాబు నిలదీసిన వ్యవహారం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రామచంద్రాపురం ఎమ్మెల్యేగా గెలిచిన వాసంశెట్టి సుభాష్ ను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా వెంటనే తన కేబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. సామాజికవర్గాన్ని చూసి ఆయనను మంత్రివర్గంలోకి చేర్చుకుని ఉండవచ్చు. కానీ అదే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించబోనని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
వానంశెట్టికి వార్నింగ్...
వాసంశెట్టి సుభాష్ తన నియోజకవర్గమైన రామచంద్రాపురంలో తక్కువ సభ్యత్వాలను నమోదు చేయించడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగయితే తాను సహించబోనని తేల్చిచెెప్పారు. అవసరమైతే వేరే వారికి అవకాశం ఇస్తామని కూడా హెచ్చరించారంటే పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది మంత్రి వాసంశెట్టి సుభాష్ కు మాత్రమే వార్నింగ్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వాల నమోదు విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న నేతలందరికీ ఈ హెచ్చరికలు వర్తిస్తాయని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కక, పదవులు లభించక పార్టీని పట్టించుకోవడం లేదన్న సమాచారం చంద్రబాబుకు అందింది.

బలమైన సంకేతాలు...

ీఆ సమాచారంతోనే చంద్రబాబు నాయుడు మంత్రి వాసంశెట్టి వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. దీంతో పాటు మరికొందరు సీనియర్ నేతలకు కూడా పరోక్షంగా హెచ్చరికలను టీడీపీ చీఫ్ పంపినట్లయింది. పార్టీ పట్ల అలసత్వం ప్రదర్శించినా, కార్కకర్తలను నిర్లక్ష్యం చేసినా తాను ఊరుకోనని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లయింది. గత వైసీపీ ప్రభుత్వం కూడా క్యాడర్ ను పట్టించుకోక పోవడం వల్లనే ఓటమి పాలయింది. ఆ దుస్థితిని కొని తెచ్చుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. ఆ రకమైన సంకేతాలను బలంగా పార్టీ నేతలకు పంపగలిగారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడును మెచ్చుకోకుండా ఉండలేం. ఇటు అధికారిక సమీక్షలు చేస్తూనే.. మరొక వైపు పార్టీ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ గాడిన పెట్టడం ఒక్క చంద్రబాబు వంటి నేతలకు మాత్రమే చెల్లుతుంది.


Tags:    

Similar News