Pawan Kalyan : ఏదో ఉంది భయ్యా.. లేకుంటే.. ఈ అర్జెంట్ ప్రయాణమేంటి?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. అయితే అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ ప్రయాణం రాజకీయంగా చర్చ దారితీసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ ఐదు నెలల పాటు పవన్ ఢిల్లీ బాట పట్టలేదు. రెండు మూడు సార్లు వెళ్లినా వేరే పనుల నిమిత్తం వెళ్లారు తప్పించి ఆయన రాష్ట్ర పనులు, రాజకీయాల నిమిత్తం పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అనేక సార్లు ఒంటరిగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కలసి వచ్చారు. పవన్ మాత్రం ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఢిల్లీకి వెళ్లలేదు.
ఐదు నెలల నుంచి...
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి హస్తిన ప్రయాణం ఎందుకు? అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి బీజేపీకి నమ్మకైన మిత్రుడు పవన్ కల్యాణ్. చంద్రబాబు కంటే పవన్ ను మోదీ, అమిత్ షాలు ఎక్కువగా ప్రేమిస్తారు. అలాంటిది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తినకు పవన్ దూరంగా ఉన్నారు. బీజేపీ పెద్దలతో టచ్ లో లేరు. ప్రధానంగా రాష్ట్రంలో కొన్ని సమస్యలున్నాయి. అందులో ప్రధానమైనది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ కార్మికులు గత కొద్ది రోజులుగా ఆందోళనకు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని గట్టిగా కార్మికులకు పవన్ హామీ ఇచ్చారు.
అనేక అంశాలు...
ఈ నేపథ్యంలో అమిత్ షాతో జరిగే చర్చల్లో పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయన అమిత్ షాతో చర్చించనున్నారు. ప్రధానంగా శాంతి భద్రతల సమస్యపై తాను లేవనెత్తిన పాయింట్లను వివరించనున్నారు. ఇటీవల సనాతన ధర్మం పేరుతో తాను దీక్ష చేపట్టనట్లు, తిరుపతిలో నిర్వహించిన సభ విషయం వీరి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశముందని తెలిసింది. తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా వీరి చర్చల్లో ప్రధాన అంశంగా మారనుందని చెబుతున్నారు.
ప్రిపరేషన్ మీటింగా?
మరోవైపు బీజేపీ పవన్ కల్యాణ్ కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని మోదీ కుండ బద్దలు కొట్టేశారు. జమిలి ఎన్నికలను ఎవరూ ఆపలేరని కూడా ఆయన అన్న తర్వాత పవన్ కల్యాణ్ ను పిలిపించుకుని మాట్లాడుతుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ను చూసి ఆయనను వినియోగించుకోవాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు కనపడుతుంది. అలాగే ఏపీలోనూ ఈసారి ఎక్కువ స్థానాలను బీజేపీ, జనసేనలు టీడీపీ నుంచి కోరేలా పవన్ కల్యాణ్ ను ముందుగానే సిద్ధం చేయడానికి ఈ ప్రిపరేషన్ మీటింగ్ అంటున్నారు కొందరు. మరి ఏదిఏమైనా పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన మాత్రం ఏపీ రాజకీయాల్లో మలుపు తిరిగే అవకాశముందని మాత్రం తెలుస్తోంది.